ఆధ్యాత్మిక పరవశం… నిజరూప దర్శనం

సింహగిరిపై నేడు చందనోత్సవం
పూర్తయిన ఏర్పాట్లు
శ్రీగంధం సిద్ధం
చందనోత్సవాన్ని పురస్కరించుకుని అప్పన్న స్వామి దేహంపై ఉన్న చందనాన్ని ఒలిచి తిరిగి స్వామికి సమర్పించేందుకు శ్రీగంధాన్ని అర్చకులు ఆదివారం సిద్ధం చేశారు. సింహగిరిపై నాలుగు రోజుల పాటు సిబ్బంది అరగదీసిన 125 కిలోల పచ్చి చందనంలో సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు మిళితం చేశారు. ఈ చందనాన్ని ఆలయ భాండాగారంలో భద్రపరిచారు. స్వామికి శ్రీగంధాన్ని సమర్పించేందుకు వినియోగించే పొత్తు వస్త్రాన్ని సిద్ధం చేశారు. అలాగే సోమవారం రాత్రి జరిగే సహస్ర ఘటాభిషేకంలో వినియోగించే 108 వెండి కలశాలకు రంగుల దారాలను చుట్టి సిద్ధం చేశారు.
పూర్తయిన ఏర్పాట్లు
సింహగిరిపై చందనయాత్రను పురస్కరించుకుని తరలిరానున్న భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు పంపిణీ చేసేందుకు తాగునీటి ప్యాకెట్లు సిద్ధం చేశారు. క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో టెంట్లు, షామియానాలు వేశారు. 50వేల మంది అన్నదానికి, ఆలయం నుంచి భక్తులు వెలుపలకు వచ్చే మార్గం వద్ద స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పండ్లు, ఫలహారాలు, ఆహార పదార్థాల పంపిణీకి ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం సుమారు పది ఆసుపత్రులకు చెందిన వైద్యులు, అంబులెన్సులు సిద్ధం చేశారు. పోలీస్ శాఖ అధికారులు 1400 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ దిగువన పార్కింగ్ ప్రాంతాల వద్ద ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి భక్తులను ఉచితంగా సింహగిరిపైకి తరలించేందుకు 36 ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.
అందరి సహకారంతో విజయవంతం
ఉద్యోగులంతా సమన్వయంతో వ్యవహరించి ఒకరికొకరు సహకరించుకుంటే చందనోత్సవం విజయవంతంగా నిర్వహించవచ్చని ఉత్సవ ప్రత్యేకాధికారి చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సింహగిరిపై దేవాదాయశాఖ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా ఉత్సవం విజయవంతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఈవో కె.రామచంద్రమోహన్, ఏఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Source : http://www.eenadu.net/