News

Realestate News

ఆద్యంతం…అద్భుతం

Span and miracle

ఆద్యంతం…అద్భుతం
ఈనాడు, విశాఖపట్నం
నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆర్‌.కె.బీచ్‌లో తూర్పు నౌకాదళ అధికారులు, ఉద్యోగులు నిర్వహించిన పలు యుద్ధ విన్యాసాలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఆయా విన్యాసాలు భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటిచెప్పాయి. ముఖ్యంగా హాక్‌ యుద్ధ విమానాలు వాయువేగంతో ప్రయాణిస్తూ… తీవ్రమైన గాలుల్ని సైతం తట్టుకుని రకరకాలుగా చక్కర్లు కొట్టి వీక్షకుల్ని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఆరువేల అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానం నుంచి మెరైన్‌ కమెండోలు పారాచూట్ల సాయంతో దూకేశారు. వారిలో పలువురు కచ్చితంగా వేదికపైకి దిగి వీక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. వాస్తవానికి ఆదివారం సాయంత్రం గాలివేగం చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ వారు వేదికపై దిగడం గమనార్హం. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడానికి యు.హెచ్‌.3హెచ్‌. హెలీకాప్టర్‌ నుంచి ఒక తొట్టెను సముద్ర ఉపరితలం మీదకి దించి సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించడం, తాడు సాయంతో హెలీకాప్టర్‌ మీద నుంచి సముద్రంలోకి దిగడం తదితర విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. యు.హెచ్‌.3హెచ్‌. హెలీకాప్టర్లో ఒకేసారి తొమ్మిది మందిని రక్షించి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. అందుకుగానూ ఇందులో ఇద్దరు వైద్యులు ఆ హెలీకాప్టర్లో ఉంటారు. తీరంలో దాగున్న శత్రువులపై దాడులు జరిపే విన్యాసాలైతే వీక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేశాయి. తుపాకీలు, రాకెట్‌ లాంఛర్లతో భారీ శబ్దాలు చేస్తూ కాల్పులు, దాడులు చేయడం… బి.ఎం.పి. యుద్ధట్యాంకులతో తీరంలో తిరుగుతూ శత్రువుల్ని తుదముట్టించిన ఘటనలతో తీర ప్రాంగణం మొత్తం హోరెత్తి పోయింది. 84 ఐ.ఎస్‌.వి. స్క్వాడ్రన్‌కు చెందిన నావికులు సముద్ర తీర ఆస్తుల పరిరక్షణలో ఎంతలా శ్రమిస్తారో కళ్లకు కట్టారు. శత్రుదేశ నమూనా రిగ్గును పేల్చేసిన ఉదంతం ఆశ్చర్యానికి గురిచేసింది. నౌకలపై హెలీకాప్టర్లు దిగే విన్యాసంలో శివాలిక్‌, సత్పురా, రణ్‌విజయ్‌, రాజ్‌పుత్‌ నౌకలు పాల్గొనగా, వాటిపై యు.హెచ్‌.3హెచ్‌., సీకింగ్‌, కమోవ్‌, చేతక్‌ హెలీకాప్టర్లు ల్యాండ్‌ అయ్యాయి. ఐ.ఎన్‌.ఎస్‌. జలాశ్వ యుద్ధనౌకలో ఉండే ఎల్‌.సి.ఎం.లలో యుద్ధట్యాంకర్లు వచ్చిన దృశ్యాలు కూడా చూపరుల్ని ఆకట్టుకున్నాయి. చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఆయా ఎల్‌.సి.ఎం.లు ఒక్కోదానిలో 150 మంది నావికులతోపాటు రెండు యుద్ధట్యాంకుల్ని కూడా నేరుగా సముద్ర తీరానికి తెచ్చే అవకాశం ఉండడం విశేషం. అలాంటి నాలుగు ఎల్‌.సి.ఎం.లను విన్యాసాల్లో భాగంగా చూపించారు. కార్యక్రమ ముగింపునకు గుర్తుగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో భాగంగా నౌకాదళ వాయిద్య బృందం వీనులవిందైన సంగీతంతో అలరించింది.

సముచిత సత్కారం… : నౌకాదళ కమాండర్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ అనంతరం కూడా రేస్‌వాక్‌ పోటీల్లో పాల్గొంటూ పలు అంతర్జాతీయ పతకాల్ని సాధిస్తూ నౌకాదళానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న 93 ఏళ్ల వి.శ్రీరాములును తూర్పునౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ హెచ్‌.సి.ఎస్‌.బిస్త్‌ ఘనంగా సన్మానించారు. వాస్తవానికి నౌకాదళ దినోత్సవ కార్యక్రమంలో అతికొద్దిమంది ప్రముఖులకు మాత్రమే వేదికపైకి స్థానం కల్పిస్తారు. అలాంటిది శ్రీరాములు దంపతులిద్దరినీ వేదికపై కూర్చోపెట్టారు. కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు చేతుల మీదుగా ఆయనకు జ్ఞాపికను కూడా బహుకరించారు.

ఘనంగా ఎట్‌హోం…. : కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులకు తూర్పునౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ హెచ్‌.సి.ఎస్‌.బిస్త్‌ తన అధికారిక నివాసంలో ‘ఎట్‌హోం’ కార్యక్రమం పేరుతో తేనీటి విందును ఇచ్చారు. కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుతోపాటు ఎంపీ హరిబాబు, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సీపీ యోగానంద్‌, పలువురు నౌకాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.