News

Realestate News

ఆత్మవిశ్వాసం నిండుగా..సాహసమే శ్వాసగా..

ఆత్మవిశ్వాసం నిండుగా..సాహసమే శ్వాసగా..
రాష్ట్ర స్థాయిలో మిషన్‌ ఎవరెస్టు-2017కు ఆరుగురి ఎంపిక
బృందంలో టెక్కలికి చెందిన కొయ్యి ఆశాకిరణ్‌రాణి
ఈ నెల 9న ఎవరెస్టును అధిరోహించేందుకు బయలుదేరనున్న బృందం
ఈనాడు డిజిటల్‌, అమరావతి
చిన్నప్పటి నుంచి ఆటలపై ఎన్నో ఆశలున్నా.. ఆర్థిక పరిస్థితులు వాటిని అణచివేసేవి. అయితేనేం.. ఏదో ఒకటి సాధించాలన్న ఆమె తపనకు ఎడారిలో ఒయాసిస్సులా కనిపించిన సర్కారు సహకారం అమృత హస్తమై చేయూతనందించింది. ఫలితంగా ఈ నెల 9న ఎవరెస్టు శిఖరం అధిరోహించేందుకు పయనం కాబోతోంది. ఈ క్షణాలను కలలో కూడా ఊహించలేదంటున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కొయ్యి ఆశా కిరణ్‌రాణి. యువతలో ధృడ సంకల్పం పాదుకొల్పేందుకు, మహిళలను సాహస, క్రీడా రంగాల్లో రాణింపజేసే ఉద్దేశంతో మిషన్‌ ఎవరెస్టు-2017 పేరుతో పర్వతారోహణ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం గతేడాది శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జరిగిన ఎంపిక పోటీలు, తర్వాత జరిగిన కఠోర శిక్షణలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎవరెస్టు అధిరోహణ కోసం రాష్ట్ర స్థాయిలో అర్హత సాధించిన ఆరుగురి బృందంలో ఉన్న ఏకైక యువతి ఈమె. కనీసం చదువుకొనే స్థోమత లేని తాను త్వరలో ఎవరెస్టు అధిరోహించనుండటం సంతోషంగా ఉందని.. తన లాంటి వారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఆశా అంటున్నారు.

మాది జిల్లాలోని నందిగాం మండలం, ఉయ్యాలపేట. అయితే టెక్కలిలో స్థిరపడ్డాం. అమ్మానాన్నలకు కూలి పనే జీవనాధారం. పదో తరగతి వరకూ టెక్కలి ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. తర్వాత ఉపకార వేతనాల సాయంతో ఇంటర్‌ పూర్తి చేశా. ఇప్పుడు విశాఖపట్నంలో ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేయబోతున్నా.

పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవారిని అన్వేషించేందుకు గతేడాది ‘ఈనాడు’ పత్రికలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ‘మిషన్‌ ఎవరెస్టు-2017’ ప్రకటన చూసి ఎంపిక పోటీలకు హాజరయ్యా. జిల్లా స్థాయిలో శ్రీకాకుళంలో, రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో నెగ్గా. అప్పటివరకూ ఇంట్లో కూడా చెప్పలేదు. పోటీల కోసం టెక్కలి-శ్రీకాకుళం-విజయవాడ తిరిగేందుకు బస్సు ఛార్జీలు స్నేహితులే సమకూర్చారు.

నాతో పాటు రాష్ట్రస్థాయిలో ఎంపికైన మొత్తం 40 మందిని డార్జిలింగ్‌ పంపి అక్కడి హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 20 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా ఏడు రోజుల పాటు ట్రెక్కింగ్‌ చేశాం. అక్కడే రీనాక్‌ పర్వతాన్ని అధిరోహించాం.

ఈ దశలో వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలిగిన 20 మందిని ఎంపిక చేసి జమ్ము కశ్మీర్‌ తీసుకెళ్లి, జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌లో మరో 20 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో మళ్లీ పది మందిని ఎంపిక చేసి తులియాన్‌ పర్వతం ఎక్కించారు. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో సుమారు 12 వేల అడుగుల ఎత్తు వరకూ వెళ్లగలిగాం. వాతావరణం అనుకూలించక పూర్తి చేయలేకపోయాం.

ఇక్కడి నుంచి లద్దాక్‌ తీసుకెళ్లారు. స్టాక్‌ నుంచి మొదలై చావ్‌కాంగ్‌లోని బేస్‌ క్యాంపులో 3 రోజులు ఉండి ఆర్‌ఆర్‌ అనే పర్వతాన్ని అధిరోహించాం. ఎవరెస్టును అధిరోహించేందుకు జరిగిన ఈ ముందస్తు కఠోర శిక్షణలో ఆఖరి మజిలీకి మొత్తం ఆరుగురం అర్హత సాధించాం. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిబద్ధత, ఆత్మవిశ్వాసంతో సాధన చేశాను. మా బృందానికి మార్గ నిర్ధేశకుడిగా ఉన్న ట్రాన్సాండ్‌ అడ్వంచర్స్‌ శేఖర్‌బాబు ప్రోత్సాహం మరువలేనిది.

చిన్నప్పుడు పాఠశాల, మండల స్థాయిల్లో బ్యాడ్మింటన్‌, కబడ్డీ వంటి పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెల్చుకున్నా. సాహస కృత్యాలు, క్రీడా రంగాల్లో ఆ సమయంలో ఎన్నో అవకాశాలొచ్చినా స్థోమత లేక వదులుకోవాల్సి వచ్చింది. అయినా నాలో తహతహ మాత్రం అంతే ఉంది. నాలాంటి వారిని గుర్తించి, పూర్తి సహకారం అందించిన ప్రభుత్వానికి, శేఖర్‌బాబుకు ఎంతో రుణపడి ఉంటాను.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo