News

Realestate News

ఆతిథ్య రంగంలో పెట్టుబడుల కోసం 27న సదస్సు

ఆతిథ్య రంగంలో పెట్టుబడుల కోసం 27న సదస్సు
ప్రముఖ సంస్థలకు ఆహ్వానం
కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి
వన్‌టౌన్‌,న్యూస్‌టుడే: పర్యాటక, ఆతిథ్య, విద్యా రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. విశాఖ నగరం వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తోందని, దీనికి తగ్గట్టుగా అతిథ్య రంగం విస్తరించాల్సి ఉందన్నారు. ఇటీవల సీఆర్‌డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టేందుకు పలుసంస్థలు ముందుకు వచ్చాయన్నారు. ఇదే తరహాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులను ఆతిధ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. దీనికి తగ్గట్టుగా ఆయా సంస్థల ప్రముఖులతో ఈనెల 27న విశాఖలో సదస్సు నిర్వహిస్తున్నామని, ఆతిథ్య రంగం విస్తరణకు విశాఖలో ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించనున్నామని వెల్లడించారు. సోమవారం కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.ఠక్కర్‌ విశాఖకు వస్తున్నారని, 27న సీఎస్‌ ఆతిథ్య రంగ ప్రముఖులతో జరిగే సదస్సులో పాల్గొంటారని తెలిపారు. 500 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పర్యాటక రంగం ప్రగతి కోసం పలు కార్యక్రమాలను చేపడుతున్నామని కలెక్టర్‌ వివరించారు. సదస్సు ముగిసిన తర్వాత విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన విద్యా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి సదస్సు నిర్వహిస్తామని, ఇక్కడ వసతులు వివరించి సంస్థలు నెలకొల్పాలని కోరుతామని తెలిపారు. ముంబయికి చెందిన ఒక విద్యాసంస్థ అడివివరంలో పాఠశాలను ఏర్పాటు చేసేందుకు పది ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో అర్ధరాత్రి వరకు సందర్శకులు స్వేచ్ఛగా తిరిగేలా చర్యలను తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి ఎక్సైజ్‌ చట్టానికి సవరణలు తేవాల్సి ఉందన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. పలు సంస్థలు, ప్రముఖులు విశాఖకు రావాలంటే ఇటువంటి వసతులు ఉండాలని కోరుతున్నారని, అందుకు తగ్గట్లుగా వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్‌ వివరించారు.

అత్యాధునిక వసతులతో కన్వెన్షన్‌ సెంటర్‌..
అత్యాధునిక వసతులతో కన్వెన్షన్‌ సెంటర్‌ను బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. దీనికి అనుగుణంగా కన్సెల్టెంట్‌ సంస్థ డిజైన్లను రూపొందిస్తోందన్నారు. బీచ్‌రోడ్డులో 11.50 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, దీన్ని ఆనుకొని ఉన్న సీఎంఆర్‌ సంస్థ భూమి మరో 3ఎకరాలు ఉందన్నారు. సీఎంఆర్‌సంస్థ భూమి తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని, వారం రోజుల వ్యవధిలో ఇవి కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయన్నారు. సీఎంఆర్‌ సంస్థకు ప్రత్యామ్నాయంగా భూమి కావాలంటే ఇంచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కాపులుప్పాడ తదితర ప్రాంతాల్లో అనువైన ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 3 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మిత ప్రదేశాలు వస్తాయన్నారు. భారీ కన్వెన్షన్‌ సెంటర్‌తో పాటు హోటల్‌ గదులు, చిన్నపాటి సమావేశమందిరాలు, ఇతర వసతులు సమకూర్చనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. వచ్చే ఏడాది నవంబరు నాటికి ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. 2017 జనవరి 27 నుంచి భాగస్వామ్య సదస్సు జరుగుతుందన్నారు. అదే ఏడాది నవంబరు వరల్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌కు విశాఖ వేదిక అయ్యే అవకాశాలున్నాయన్నారు. దానికోసం పోటీ పడుతున్న నగరాల జాబితాలో విశాఖ కూడా ఉందన్నారు. ఇటువంటి భారీ సదస్సులకు తగ్గట్లుగా విశాఖలో వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సొసైటీకి కేటాయించిన భూములకు వెళ్లే దారిలో తొట్లకొండ ఉన్నందున ప్రత్యామ్నాయంగా రహదారులను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని కలెక్టర్‌ తెలిపారు. అలాగే తూర్పునౌకాదళానికి వైర్‌లెస్‌ కేంద్రం ఏర్పాటుకు 80 ఎకరాల స్థలం కేటాయించామని వివరించారు.