ఆటలకు సై
ఆటలకు సై
నర్సీపట్నానికి మరిన్ని క్రీడా వసతులు
రూ. 2 కోట్లతో కొత్తగా ఇండోర్ స్టేడియం
నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే : పురపాలికలోని అయ్యన్న కాలనీని ఆనుకుని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. జూనియర్ కళాశాలతో పాటు బాలికల గురుకుల విద్యాలయం, ప్రభుత్వ అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాల ఒకే చోట ఉన్నందున ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. వివిధ క్రీడా వసతులతో పాటు క్రీడాకారులు రాత్రి బస చేసేందుకు డార్మిటరీని నిర్మిస్తారు. దీంతో పాటు నర్సీపట్నానికి క్రీడా వికాస కేంద్రం మంజూరైంది. బాక్సింగ్‌లో నర్సీపట్నానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నందున ఈ కేంద్రం మంజూరు చేశారు. దీంతోపాటు కరాటే, చెస్బాక్సింగ్లో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. ఎన్.టి.ఆర్. మినీ స్టేడియంలో..
నిర్వహించనున్న ఈ కేంద్రంలో బాక్సింగ్తోపాటు వాలీబాల్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, హ్యాండ్‌బాల్, హాకీ, అథ్లెటిక్స్‌కు అవసరమైన క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచుతామని క్రీడా క్రీడాధికార సంస్థ అధికారి జూన్ గెలియట్ తెలిపారు. నెలలో అవసరమైన సామగ్రి ఇక్కడకు పంపిస్తారు. జిల్లాలో ప్రస్తుతం పన్నెండు మినీ క్రీడావికాస కేంద్రాలు ఉన్నాయి. ఈనెలాఖరు కల్లా స్కేటింగ్ రింక్ సిద్ధమవుతోంది. అధునాతన వ్యాయామశాల (జిమ్) కూడా ఏర్పాటు కానుంది. ఎన్.టి.ఆర్ స్టేడియంలోని కళావేదికపై దీన్ని తొలుత నిర్వహిస్తారు. కళావేదిక భాగంలో అదనపు భవనాన్ని నిర్మించిన అనంతరం జిమ్ని దాంట్లోకి మార్పు చేస్తారు. క్రీడల్లో విశాఖ నగరానికి ప్రాథాన్యం ఇస్తున్న మాదిరిగా గ్రామీణ జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న నర్సీపట్నానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అయ్యన్న పాత్రుడు ఇప్పటికే జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు.