‘ఆకర్షణీయ’ నిధులు విడుదల

జీవీఎంసీ ఖాతాలో చేరిన రూ.396 కోట్లు
ఎస్పీవీ కార్యకలాపాలపై దృష్టి!
కార్పొరేషన్, న్యూస్‌టుడే: విశాఖ నగర ఆకర్షణీయ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు జీవీఎంసీ పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతాలోకి చేరాయి. 2015 జూన్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆకర్షణీయ’ నగర ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. నగరాల ఎంపిక, చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలు తయారు కావడానికి ఏడాది పట్టడంతో 2016 జూన్ 25న ఆయన ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్రంలోని కాకినాడ, విశాఖపట్నం ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయి. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది. ఆయా నిధులు నెల రోజుల క్రితమే ఏపీయూఎఫ్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ)కు చేరాయి. నగరానికి సంబంధించి ప్రత్యేక అవసరాల వ్యవస్థ(స్పెషల్ పర్పస్ వెహికల్, ఎస్పీవీ) కేటాయింపు, అంతకంటే ముందుగా పీఎంసీ(ప్రాజెక్టు మానటరింగ్ సెల్)ను ఏర్పాటు కావాల్సి ఉంది. ఇటీవల పీఎంసీని కేంద్ర ప్రభుత్వం ఖారారు చేయడంతో నిధులు పీడీ ఖాతాలో చేరాయి. పీఎంసీ ఏర్పాటు కావడంతో ఏస్పీవీ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. ఎస్పీవీ పూర్తిస్థాయిలో ఏర్పాటు, పీఎంసీ ద్వారా నిపుణులను డిప్యుటేషన్‌పై తీసుకోవడం వంటి ప్రక్రియలన్నీ మరో మూడు నెలల్లో పూర్తి చేసే అవకాశాలున్నాయి. అనంతరం ఎంపిక చేసిన 1700 ఎకరాల్లో ఆకర్షణీయ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. జీవీఎంసీ, వుడా, ఈపీడీసీఎల్, ఆర్టీసీ, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రాజెక్టు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.