ఆకర్షణీయ నగరంగా తీర్చేదిద్దే ప్రక్రియలో ఏయూ సహకారం

విదేశీ ప్రతినిధులకు వీసీ హామీ
ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే: విశాఖను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే మహోన్నత ప్రక్రియలో తమవంతుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని నిపుణుల సహకారం అందిస్తామని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పేర్నొన్నారు. ఆకర్షణీయ పట్టణాల పథకంపై అధ్యయనం చేసేందుకు వచ్చిన అమెరికా ప్రతినిధులతో వీసీ మంగళవారం సమావేశమయ్యారు. అమెరికా ఎంబసీకి చెందిన ఆల్ ఇండియా ప్రిన్సిపల్ ప్రోగ్రాం సలహాదారు మనదీప్కౌర్, మిన్నోసోటా విశ్వవిద్యాలయం ఆచార్య డాక్టర్ అనురామస్వామి ఏయూను సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా ఎంబసీకి చెందిన మనదీప్కౌర్ మాట్లాడుతూ అమెరికాకు చెందిన నిపుణుల బృందం భారతదేశంలో విశాఖ, అలహాబాద్, అజ్మీర్ నగరాలను సందర్శిస్తారన్నారు. ఎనర్జీ, ఇంజినీరింగ్, పర్యావరణ రంగాలకు సంబంధించి ఏయూ ఆచార్యుల సహకారం అవసరమన్నారు. ఆకర్షణీయ నగరాలకు సంబంధించి సుస్థిర నగరాలను సృజనాత్మకంగా రూపొందిస్తామన్నారు. ఇందులో భాగంగా అమెరికా నుంచి రవాణా విభాగం ప్రతినిధులు సందర్శనకు వస్తారన్నారు. ఆచార్య అను రామస్వామి మాట్లాడుతూ జీవీఎంసీ చేస్తున్న కార్యక్రమాలలో తాము సహాయ కారులుగా ఉంటామన్నారు. విద్యుత్తు, పారిశుద్ధ్యం, ఆహార సరఫరా, సామాజిక స్థలాలు, రవాణా, వ్యర్థాల నిర్వహణ తదితరాలపై తాము విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా పనిచేసేందుకు చర్చిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు మనదీప్కౌర్, అను రామస్వామిలను ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు శాలువాతో సత్కరించారు. ఈ విభాగానికి సమన్వయకర్తగా ఆచార్య బాలప్రసాద్ను నియమిస్తున్నట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య నారాయణ, రిజిస్ట్రారు ఆచార్య ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆచార్యులు జి.వి.ఆర్.బాలప్రసాద్, ఇ.ఉదయ భాస్కరరెడ్డి, టి.బైరాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.