అర చేతిలో… యువ ప్రతిభ

అద్భుత ఆలోచనలతో ముందడుగు
ప్రశంసలు అందుకుంటున్న విద్యార్థులు
పీఎంపాలెం/కొమ్మాది, న్యూస్‌టుడే
యువ ఆలోచనలతో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. తమ ప్రతిభను అరచేతిలో చూపించేందుకు విద్యార్థులు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఒక వైపు ఎంచుకున్న విభాగంలో చదువుతూ ఆయా రంగానికి దోహదపడే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసి విజయం సాధిస్తున్నారు. రేపటి తరం పారిశ్రామిక వేత్తల జాబితాలో తామూ ఉంటామని ఘంటాపథంగా చెబుతున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం యువతలో స్ఫూర్తిని కలిగిస్తోంది. ఈ ప్రభావంతో విద్యార్థులు సాంకేతిక పరమైన కొత్త విషయాలు కనుగొనేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొమ్మాది ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ ఆఖరి సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు కొత్త యాప్ రూపొందించడం ద్వారా చరవాణిల్లో ఇంటర్‌కమ్ (క్యాండీ ఓ ఎస్) సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. కంప్యూటర్ వినియోగంలో ఎంతో ప్రధానమైన ‘సీపీయు’ పరికరాన్ని కేవలం అరచేతిలో ఇమిడి పోయే అతి చిన్న పరిమాణం (క్యాండీ బాక్స్)లో తయారు చేసి పలు ప్రయోగాత్మక ప్రదర్శనల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో ఎందరో నిపుణుల మన్ననలు అందుకుంటున్నారు.
‘ఎఫ్’ పీబీఎక్స్ సిస్టమ్ (చరవాణి ఇంటర్‌కమ్)
టెలిఫోన్ ఇంటర్‌కమ్ (పీబీఎక్స్) మాదిరిగా పనిచేసే ఈ చరవాణి వర్చ్యువల్ ఇంటర్‌కమ్ (ఈపీబీఎక్స్) యాప్‌ను కె.ఫణీంద్రాచార్యులు, వి.సాయికుమార్, ప్రశాంతి, నికేత్లు రూపొందించారు. ఈ యాప్‌కు వీరు ప్రత్యేకంగా ‘ఎఫ్’ అని పేరు పెట్టారు. ఇది వైఫై సహాయంతో పని చేస్తుంది. సుమారు ఒకే ప్రాంతంలో 500 మీటర్ల పరిధిలో ఉన్న పలు చరవాణిల్లో దీనిని వినియోగించుకోవచ్చు. సంబంధిత వైఫై పరిధి తర్వాత మరో వైర్లెస్ రూటర్ ఏర్పాటు చేసుకుంటే అదనంగా కొంత దూరం పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. అలా రూటర్లను పెంచుకుంటూ పోతే ఎంత దూరమైనా దీనిని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం విద్యార్థులు రూపొందించిన ఈ ‘ఎఫ్’ను కళాశాల పరిధిలో ఉద్యోగులు, బోధన సిబ్బంది పరస్పర సహకారంగా వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ‘ఎఫ్’ను చరవాణిలో డౌన్లోడ్ చేసుకునేందుకు వర్చ్యువల్ ఇంటర్‌కమ్ సౌకర్యం ఏర్పాటు చేసుకునే చోట ముందుగా ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తద్వారా చరవాణిలో ‘ఎఫ్’ టచ్ చేస్తే ‘నోడ్జెస్ సర్వర్’ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆపై స్క్రీన్‌పై కనిపించే రన్ టచ్ చేయడం ద్వారా ‘ఎఫ్’ పరిధిలో ఉన్న చరవాణి నెంబర్లు కనిపిస్తాయి. అప్పుడు మనకు అవసరమైన అవతలి వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. సిమ్‌కార్డుతో సంబంధం లేకుండా జరిగే ఈ ప్రక్రియ వల్ల నగదు ఖర్చు కూడా ఉండదు. కేవలం విద్యాలయం, పరిశ్రమ, కార్యాలయాల్లో అప్పటికే అందుబాటులో ఉన్న వైఫై సౌకర్యంతోనే దీని పనితీరుని వినియోగించుకోవచ్చు. సంబంధిత విభాగంలో చదువుతూ ఆరు నెలల పాటు శ్రమించి విద్యార్థులు దీనిని రూపొందించారు. దీనిని ఇటీవల నోవాటెల్ (హైదరాబాద్) వేదికగా జరిగిన స్టార్టప్‌లో ప్రదర్శనగా ఉంచి ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే గెయిట్ (రాజమండ్రి) లో నిర్వహించిన ప్రదర్శన ద్వారా రాష్ట్ర ఐటీ చీఫ్ అడ్వైజర్ జె.ఎ.చౌదరి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే మాదిరిగా స్టూడెంట్ పోర్టల్ ఇన్ఫర్మేషన్ బేస్, ఆన్లైన్ షాపింగ్ తరహాలో ఈ-పోర్టల్ అనే రెండు యాప్‌లను సైతం విద్యార్థులు రూపొందించారు.
కేండీ ఓ ఎస్ (మినీచ్యురైజ్డ్ కంప్యూటర్ సిస్టమ్)
కంప్యూటర్ పనితీరుని చేతిలో ఇమిడి పోయేలా చిన్న ప్లాస్టిక్ పెట్టెలో అమర్చి విద్యార్థులు సరికొత్త సాంకేతికతకు తెరతీశారు. ‘పాస్ప్ బెర్రీ -పీఐ’ ఓపెన్ సోర్స్ బోర్డులో మైక్రో కంట్రోలర్ అమర్చి సంబంధిత సాఫ్ట్వేర్ వాడడం ద్వారా అతి చిన్న ‘సీపీయు’ని రూపొందించారు. దీని ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ బేస్డ్లో జరుగుతుంది. దీని ద్వారా కీబోర్డుతో పాటు మౌస్, ఎల్సీడీ, సీఆర్టీ స్క్రీన్, లాన్పోర్ట్, హెచ్డీఎమ్ఐ తదితరాలు పనిచేస్తాయి. దీని ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం మెమరీ కార్డులో ఉంటుంది. 1జీబీ ర్యామ్, 64జీబీ హార్డ్‌డిస్క్, 32 బిట్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ దీని కెపాసిటీ. అలాగే క్రీడలు, లైబర్ ఆఫీస్ (ఎంఎస్ ఆపీస్ మాదిరి), ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు లైనక్స్ అనుబంధమైన అన్ని అప్లికేషన్స్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ టీవీతో పాటు అధునాతన ఎల్ఈడీ స్క్రీన్లలో దీనిని వినియోగించుకోవచ్చు. స్క్రీన్ అందుబాటులో ఉన్న ఒక కారు లేదా మరే ఇతర వాహనంలో వెళ్తూ దీనిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఇటీవల కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక అంశాల ప్రదర్శనల్లో ‘కేండీ ఓ ఎస్’ ప్రథమస్థానం దక్కించుకుంది. అలాగే ఎన్ఎస్టీఎల్, వీటీ సంస్థలు నిర్వహించిన ప్రదర్శనల్లో పలువురు శాస్త్ర, పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకుంది. ఈ మినీచ్యూర్ కంప్యూటర్ సిస్టమ్‌ను రెండు సంవత్సరాల వ్యవధిలో విద్యార్థులు కె.నితిన్‌కుమార్, కె.ఎస్.ఎన్.రాజు, కె.భానుగాయత్రీ, ఎం.సాక్షి, పి.అనిల్‌కుమార్, పి.ధీరజ్యాదవ్, వి.ఎన్.నిఖిల్, కె.ఆకాష్‌లు బృందంగా ఏర్పడి తీర్చిదిద్దారు. దీనికి పేటెంట్ హక్కులు పొందడానికి విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, చైతన్య కళాశాలలు సంయుక్తంగా అందిస్తున్నాయి.
అవకాశాలను సద్వినియోగ పర్చుకోవాలి
వివిధ విభాగాలుగా విస్తరించిన ఇంజినీరింగ్ విద్య ద్వారా ఎన్నో పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయి. కళాశాల విద్య ఎంతో ప్రధానమైనది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ దిశగానే ఇంజినీరింగ్ విద్యార్థులను పరిశోధనల పరంగా ప్రోత్సహిస్తున్నాం. సాంకేతక పరమైన రెండు కొత్త అంశాల్లో మా కళాశాల విద్యార్థులు విజయం సాధించడం ఎంతో గర్వకారణంగా ఉంది.
బృందంగా ఏర్పడి రూపొందించాం
ఇంజినీరింగ్‌లో ఎంచుకున్న రంగానికి దోహదపడేలా విద్యకు ప్రాధాన్యం కల్పిస్తూ సాంకేతికతను పెంపొందించుకుంటున్నాం. ఈ క్రమంలో బోధన సిబ్బంది పి.లక్ష్మీకాంత్, ఎస్.శ్రీనివాసరావు సహకారం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది. తోటి విద్యార్థులతో కలిసి బృందంగా ఏర్పడి దీనిని రూపొందించాం. దీనిని ప్రదర్శనలో ఉంచడం ద్వారా ప్రథమ బహుమతి సాధించడం మాకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఇదే స్ఫూర్తితో పేటెంట్ హక్కులు సాధించిన తర్వాత సొంతంగా పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశాలు వెదుకుతాం.
కార్యాచరణ దిశగా కృషి చెయ్యాలి
రెండు సంవత్సరాలు శ్రమించి.. విద్యతో పాటు పరిశోధనలు చేసి నలుగురు విద్యార్థులు బృందంగా చరవాణి ఇంటర్కమ్ను రూపొందించాం. ముఖ్యంగా ఏదైనా ఆలోచన వస్తే దానిని కార్యాచరణ దిశగా తీసుకు వచ్చేందుకు కృషి చెయ్యాలి. సాంకేతిక పరమైన ఎన్నో విషయాలు కంప్యూటర్ల ద్వారా అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం మేం తయారుచేసిన బేసిక్ వెర్షన్‌కి వైఫై చిప్ వైర్‌లెస్‌తో మరింత ప్రభావ వంతంగా పనిచేసేలా అత్యంత సెక్యూడ్గా తయారుచేసే ప్రక్రియలో ఉన్నాం.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఈ ప్రాజెక్టును అనుసంధానిస్తూ త్వరలో మన పరిజ్ఞానంతో హార్డ్‌వేర్ డిజైన్ చేయనున్నాం.
కేంద్రమంత్రికి సత్కారం వన్‌టౌన్, తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: కేంద్ర పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల సహాయ మంత్రి సాధ్వినిరంజన్ జ్యోతిని విశాఖ దక్షిణ నియోజకవర్గ శానసభ్యులు వాసుపల్లి గణేష్‌కుమార్ సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లేందుకు సోమవారం విశాఖకు వచ్చిన ఆమె ఎమ్మెల్యే వాసుపల్లి నివాసానికి వెళ్లారు. ఈమెతో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా హాజరయ్యారు. ఇరువురు మంత్రులకు వాసుపల్లి దంపతులు సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. వివిధ అంశాలపై కేంద్రమంత్రితో వాసుపల్లి చర్చించారు.
Source : http://www.eenadu.net/