అరకు.. మరింత ఆకట్టుకునేలా!
టూరిజం సర్క్యూట్‌కు రూ.7.70 కోట్లు మంజూరు
గిరిజన సంస్కృతిని ప్రతిబించేలా పర్యటక గ్రామం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం

ఒంపుసొంపుల ఘాట్ రోడ్డులో.. గుహల్లో నుంచి దూసుకెళ్లే రైలు మార్గంలో ఆయా ప్రాంతాలను సందర్శించి ఉప్పొంగిపోతుంటారు.. పర్యాటకంగా ప్రపంచ ఖ్యాతి గడించిన ఈ ప్రాంతాల్లో మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు కొద్దిరోజులు సేదతీరుదామన్నా.. అన్ని ప్రాంతాలు చుట్టొద్దామన్నా.. ఆశించిన రీతిలో వసతుల్లేవు.. ఈ క్రమంలో ఇక్కడి అందాలకు మరింత సొబగులద్దే కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది. మన్యంలోని అందాలను కలుపుతూ అరకు ట్రైబల్ టూరిజం సర్క్యూట్‌కు సన్నాహాలు చేస్తోంది. రూ.కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై కసరత్తు చురుగ్గా సాగుతోంది.
అరకు అందాలను మరింత ఆస్వాదించేలా.. మరింత మంది పర్యటకులను ఆకర్షించేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. స్వదేశ్ దర్శన్ పథకంలో అరకు గిరిజన పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.7.70 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అరకు పర్యటక ప్రగతి పరుగులు పెట్టడానికి అవకాశం కలిగింది. ఈ నిధులతో గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఓ గ్రామాన్ని.. అన్ని రకాల రుచులు ఒకే చోట లభ్యమయ్యేలా ఆహార వీధులను నిర్మించాల్సి ఉంది. ఈ పథకంలో చేయాల్సిన పనులపై ఇప్పటికే పర్యటక శాఖ కార్యాచరణను. సిద్ధం చేసింది. నిధులు రావడమే తరువాయి పర్యటక అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి.
ఏడు ఎకరాల్లో..
గిరిజన సంస్కృతిని తెలిపేలా ఏడు ఎకరాల్లో ట్రైబల్ హట్ పేరుతో ఓ గ్రామాన్నే నిర్మించనున్నారు. ఇందుకోసం మౌలిక సదుపాయలను కల్పించడానికి పెద్దఎత్తున నిధులు ఖర్చుచేయనున్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం మంజూరు చేసిన రూ.7.7 కోట్లలో రూ.5.5 కోట్లు ఇందుకోసమే కేటాయించారు. వీటితో చేపట్టే కొన్ని పనులు ఇలా..
* శృంగవరపు కోట నుంచే రహదారి పక్కగా పర్యటకులకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు.
* హరిత, అనంతగిరిల్లో అదనంగా కాటేజీల ఏర్పాటు
* 400 చదరపు మీటర్లలో ఈతకొలను
* సాహస క్రీడల ప్రాంగణం
* పర్యావరణ హితం కోసం అందుబాటులో సైకిళ్లు ఏర్పాటు బీ బొర్రా గుహల వద్ద పర్యాటక దర్శన హాలు నిర్మాణం బీ ఎత్తైన ప్రాంతంలో తాళ్లతో కూడిన వంతెన (150 మీటర్లు) బీ హెర్బల్ వెల్నెస్ సెంటర్, యోగా, ధ్యాన కేంద్రం, ఆహారశాల, రెస్టారెంట్, గ్రంథాలయం, వ్యాయామశాల, పర్యటక మౌలిక సదుపాయాలు కల్పించేలా పాతబల్లుగూడలో వైద్య పర్యటక కేంద్రం ఏర్పాటు
* గిరిజన జీవన శైలి, సంస్కృతిని తెలిపేలా 9డి వర్చువల్ థియేటర్, గిరిజనులతో ప్రదర్శించే ఆర్ట్ థియేటర్ నిర్మాణం
* ఔషధ మ్యూజియం, బోటు షికారు, జలక్రీడలు

అరకు సందర్శనకు వచ్చేవారికి నచ్చిన ఆహారం అందుబాటులో ఉండడం లేదు. అక్కడ లభ్యమయ్యే కొన్ని రకాల ఆహారాలను మాత్రమే తీసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యటకులు ఆహారం విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్వదేశ్ దర్శన్‌లో ఆహార శాలల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేకించి ఈట్ స్ట్రీట్ పేరుతో ఆహార శాలలు ఏర్పాటుకు రూ.2.2 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ఎకరా విస్తీర్ణంలో అన్ని రకాల ఆహార పదార్థాలు లభించేలా రెస్టారెంట్లు, ఫలహారశాలలు నిర్మించనున్నారు. స్థానిక రుచులతో పాటు అంతర్జాతీయ రుచులను పర్యటకులకు అందుబాటులోకి తేనున్నారు.
త్వరలో పనులు చేపడతాం..
స్వదేశ్ దర్శన్ పథకంలో అరకు పర్యటకాన్ని చేర్చి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా మన్యాన్ని సందర్శించే పర్యటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారి అవసరాలకు తగ్గ వసతులు లేవక్కడ. తాజాగా ప్రభుత్వం రూ.7.7 కోట్లు మంజూరు చేయడంతో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. పర్యటకులకు సరిపడినన్ని కాటేజీలను నిర్మించాల్సి ఉంది. ట్రైబల్ హట్, ఈట్ స్ట్రీట్లకు అవసరమైన స్థలాలను సేకరించాల్సి ఉంది. త్వరలోనే ఈ పనులను మొదలు పడతాం.
నెరవేరనున్న ముఖ్యమంత్రి హామీ..
గతేడాది అరకులోయ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటక అభివృద్ధిపై వరాలు జల్లు కురిపించారు. కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైద్య పర్యటకంగా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తామన్నారు. ఇందులో మొదటిగా అరకు గిరిజన టూరిజం సర్క్యూట్‌కు నిధులు మంజూరు చేస్తూ తన హామీను నిలబెట్టుకున్నారు. త్వరలోనే అరకుతో పాటు మన్యంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని పర్యటకశాఖ అధికారులు చెబుతున్నారు.