News

Realestate News

అరకులో హుషారుగా..

అరకులో హుషారుగా..
సందర్శకులకు కొత్త ఆకర్షణలు
వచ్చే పర్యటక సీజన్‌కు అందుబాటులోకి..
ఆంధ్రా ఊటీ అరకులోయకి వచ్చే పర్యటకులకు చక్కని ఆతిథ్యం ఇచ్చేందుకు పర్యటక శాఖ అతిథిగృహాలు ముస్తాబవుతున్నాయి. గతేడాది అరకులోయ వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథి గృహాలను సుందరీకరించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పర్యటకశాఖ అధికారులను ఆదేశించారు. అరకులోయలోని పర్యటకశాఖ అతిథి గృహాలైన పున్నమి వేలీ రిసార్ట్స్‌, మయూరి హిల్‌ రిసార్ట్స్‌లను ఆధునికీకరించేందుకు పర్యటక శాఖ రూ. 5 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో ప్రస్తుతం అతిథి గృహాలకు కొత్తరూపు తీసుకువచ్చే చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. రాబోయే వేసవి పర్యటక సీజన్‌ నాటికి అతిథిగృహాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

– న్యూస్‌టుడే, అరకులోయ
పున్నమి వేలీ రిసార్ట్స్‌లోని ఈత కొలనును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది పర్యటకశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడున్న ఈతకొలను మరమ్మతులకు గురైంది. దీంతో దానికి కొత్త హంగులద్ది పర్యటకులు సేదదీరేలా చర్యలు తీసుకున్నారు. అలాగే లోపల భాగంలో మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మయూరి హిల్‌ రిసార్ట్స్‌ ఆవరణలోనూ నూతనంగా ఈతకొలను నిర్మించేందుకు అధికారులు రూ. కోటి మంజూరు చేశారు.

ఆకర్షణీయంగా గదులు
పర్యటక శాఖ అతిథిగృహాల్లోని గదులను నవీకరించి ఎల్‌సీడీ టీవీలు, నూతనంగా సోఫాలను ఏర్పాటు చేశారు. అలాగే స్నానాల గదుల్లో అద్దాలను అమర్చారు. అతిథి గృహంలోని 20 గదులనూ ఆధునికీకరించారు. ఎయిర్‌ కూలర్లు కొత్తవాటిని ఏర్పాటు చేశారు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ని చక్కగా చేసి పర్యటకుల మది దోచేందుకు చర్యలు తీసుకున్నారు. మొన్నటివరకు కళావిహీనంగా ఉన్న గదులు  ఇప్పుడు కొత్తశోభ సంతరించుకున్నాయి. అరకులోయని సందర్శించే పర్యటకులు గిరిజన సంప్రదాయ నృత్యం థింసాని తిలకించేందుకు వీలుగా థింసా యాంపీ థియేటర్‌ నిర్మిస్తున్నారు. పర్యటకశాఖ ఆధ్వర్యంలో నడిచే రైల్‌ కం రోడ్‌ ప్యాకేజీలో అరకులోయకి వచ్చే సందర్శకుల కోసం ప్రతిరోజూ థింసా నృత్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరుబయటే థింసా నృత్య ప్రదర్శన సాగుతోంది. పర్యటకులు ఇక నుంచి వేదికపై థింసా నృత్యం తిలకించే ఏర్పాట్లను పర్యటక శాఖ చేపడుతోంది.

డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌
పున్నమి వేలీ రిసార్ట్స్‌ ఆవరణలో డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల్లో వచ్చే పర్యటకులు ఈ రెస్టారెంట్‌ వద్ద విక్రయించే ఆహార పదార్థాలను వాహనాల్లోనే తినేలా తీర్చిదిద్దుతున్నారు. పట్టణాల్లో ఉన్న వాతావరణాన్ని ఇక్కడ కల్పించేలా పర్యటకశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రెండు మాసాల్లో అందుబాటులోకి..
అరకులోయని సందర్శించే పర్యటకులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు మాసాల్లో పనులన్నీ ఓ కొలిక్కి వస్తాయి. అతిథి గృహంలోని రెస్టారెంట్‌ని సైతం ఆధునికీకరిస్తున్నాం. రాబోయే సీజన్‌లో సందర్శకులకు కొత్త అనుభూతిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– గంగరాజు, ఈఈ, పర్యటకశాఖ