News

Realestate News

అమ్మచెంతకు పదపద..!

అమ్మచెంతకు పదపద..!
అమ్మవార్ల ఆలయాల యాత్రలో అనకాపల్లి
యాత్రస్థలంగా నూకాలమ్మ ఆలయాభివృద్ధి
రూ.16.50 కోట్లతో అభివృద్ధి పనులు
నకాపల్లి నూకాలమ్మ… ఉత్తరాంధ్ర భక్తుల కొంగు బంగారం. అమ్మవారిని రాష్ట్రంలోని భక్తులు అందరు దర్శించుకునే విధంగా దేవాదాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. పెరుగుతున్న  భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు నూతన సంవత్సరం నుంచి అష్ట అమ్మవారి ఆలయాల దర్శన యాత్రలో నూకాలమ్మ ఆలయాన్ని కూడా చేర్చుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులను దివ్యదర్శనం పేరుతో తిరుమల యాత్రకు ఉచితంగా తీసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్న భక్తులు అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఎనిమిది ఆలయాలను భక్తులకు ఉచితంగా చూపించాలని దేవాదాయ శాఖ హిందూ ధర్మప్రచార పరిషత్‌ నిర్ణయించింది. విజయనగరం పైడితల్లమ్మ, విశాఖ కనకమహాలక్ష్మి, అనకాపల్లి నూకాలమ్మ, తుని తలుపులమ్మ, పెద్దాపురం మరిడమ్మ, కృష్ణా జిల్లా కొల్లేటికోట పెద్దింటమ్మ, భీమవరం మావుళ్లమ్మ, విజయవాడ కనకదుర్గ ఆలయాలను యాత్రలో చేర్చారు. వీటిని దివ్యదర్శనం మాదిరిగానే పేద భక్తులకు ఉచితంగా చూపిస్తారు. రవాణా, భోజనం, వసతి, దరర్శనం వంటివన్నీ ఉచితంగా కల్పిస్తారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారు మాదిరి అనకాపల్లి నూకాలమ్మను తీర్చిదిద్ధడానికి ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రెండు పర్యాయాలు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు వంటశాల, గాలిగోపురం, బేడా మండపాల ఏర్పాటుతో పాటు జాతీయ రహదారి నుంచి కోవెల మీదుగా రహదారి విస్తరణ, కోవెలకు స్థల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు.

రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు
నూకాలమ్మను దర్శించుకునే భక్తులలో అధిక శాతం ఇక్కడే వంటలు చేసుకుని భోజనాలు చెయ్యడం ఆనవాయితీ. అయితే ఇందుకు అవసరమైన వంటశాలలు లేవు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసే తాటాకు పందిళ్లలో వంటలు చేసుకుంటారు. మంటలు చెలరేగి తాటాకు పందిళ్లు కాలిపోయిన సందర్భాలున్నాయి. అందుకే రెండు వంటశాలలు ఏర్పాటు చెయ్యలని నిర్ణయించారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు రూ.50 లక్షలు, ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ రూ.కోటి కేటాయించారు. వీటి పనులు త్వరలోనే ప్రారంభిస్తారు.

రూ.10 కోట్లు ఇచ్చిన చంద్రబాబు
నూకాలమ్మను దర్శించుకున్న తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు. పదవి చేపట్టిన తర్వాత గ్రామీణ జిల్లాలో చేపట్టిన పర్యటనను అమ్మ దర్శనంతోనే ప్రారంభించారు. అభివృద్ధి పనులు చెయ్యడానికి స్థలం సమస్యగా ఉందని ఎమ్మెల్యే పీలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కేవలం రెండు ఎకరాలు మాత్రం దేవస్థానానికి స్థలం ఉందని తెలిపారు. మరో నాలుగెకరాల కొనుగోలుకు రూ.5 కోట్లు నిధులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తిరుమల, తిరుపతి దేవస్థానం నుంచి నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది సీఎం మరో పర్యాయం వచ్చారు. ఈసారి అమ్మవారి విగ్రహాన్ని చూసి ముఖ్యమంత్రి మంత్రముగ్ధులయ్యారు. దాదాపు పది నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. విగ్రహాన్ని చేసిన శిల్పిని వెంటనే రప్పించాలని అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. నారావారిపల్లిలో అమ్మవారి విగ్రహం నిర్మించాల్సి ఉందని తెలిపారు. వడ్డాదికి చెందిన శిల్పి యల్లయ్య చేశారని, ఆయన చనిపోయారని స్థానిక నేతలు తెలిపారు. పర్యటన సందర్భంగా నిర్వహించిన సభలో దేవాలయ అభివృద్ధికి మరో రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో స్థల కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 56 సెంట్ల స్థలాన్ని రూ.1.70 కోట్లుతో కొనుగోలు చేశారు.

60 అడుగులకు రహదారి విస్తరణ
నూకాలమ్మ కోవెల రహదారిని 60 అడుగులకు విస్తరిస్తారు. ప్రస్తుతం ఉన్న రహదారి చాల ఇరుకుగా ఉంది. దీంతో జాతర ఇతర పర్వదినాలలో రహదారిలో ద్విచక్రవాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి. వాస్తవానికి జాతీయ రహదారికి సమీపంలోనే కోవెల ఉన్నా యాత్ర నిర్వాహకులు సైతం తమ జాబితాలో చేర్చడం లేదు. దీనికి కారణం రహదారి వెడల్పుగా లేకపోవడమే. అందుకే జాతీయ రహదారి నుంచి కోవెల మీదుగా తిరిగి జాతీయ రహదారికి చేరుకునే విధంగా అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. చోడవరం రహదారిలోని పూల్‌బాగ్‌ కూడలి వరకు విస్తరించాల్సి ఉంది. ఇప్పటికే ప్రణాళికా విభాగం అధికారులు కొలతలు తీశారు. ప్రభుత్వ స్థలాలతో పాటు కొంత మంది ఇప్పటికే స్వచ్ఛందంగా ప్రహరీలు తొలగించారు. ఇరువైపులా మురుగుకాలువలతోపాటు రహదారి నిర్మాణానికి వుడా రూ.7.50 కోట్లు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది.

అమ్మవారికి బంగారు కిరీటం
నూకాలమ్మ దేవాలయానికి ఏటా రూ.మూడు కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మూడు కేజీల బరువుగల బంగారు కిరీటం, హారం  చేయించారు. దీనిలో ఎమ్మెల్యే పీలా రెండు కేజీల బంగారం ఇవ్వగా అర కేజీ సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ, మరో అరకేజీ బంగారాన్ని ఎన్‌సీసీ స్టోన్‌ క్రషర్‌ యజమాని అందించారు. బంగారు కిరీటాన్ని ముఖ్యమంత్రి ఇప్పటికే అలంకరించారు. త్వరలోనే హారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు.

కనకదుర్గ ఆలయ మాదిరి అభివృద్ధి
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం మాదిరిగా నూకాలమ్మ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెయ్యడానికి నిర్ణయించాం. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాం. విగ్రహాన్ని గుడికి ఆనుకుని సిమెంటుతో నిర్మించారు. అందుకే గర్భగుడిని అలాగే ఉంచి మిగిలిన ప్రాంతాలనే అభివృద్ధి చేస్తాం. మాడవీధులు ఏర్పాటు చేస్తున్నాం. అభివృద్ధి పనులు చెయ్యాలంటే స్థలం కొరత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రైతుల
నుంచి భూములు సేకరిస్తున్నాం. రైతులు కూడా బాగా సహకరిస్తున్నారు.

– పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్యే

భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు
నూకాలమ్మ కోవెలకు నిత్యం వస్తున్న వేలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాన్ని అష్ట పీఠాల జాబితాలో చేర్చి పేద భక్తులకు దర్శన సౌకర్యం కల్పించడానికి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అష్ట పీఠాల యాత్రకు ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఇది అమలైతే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. వారందరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వసతి, భోజన ఏర్పాట్లు ఉచితంగా అందిస్తాం.

– ఎన్‌.సుజాత, ఈవో, నూకాలమ్మ దేవాలయం