News

Realestate News

అభివృద్ధికి ‘భూ’మంత్రం

అభివృద్ధికి ‘భూ’మంత్రం
పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటులో చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
ఆందోళనల నుంచి పరిహారం దిశగా రైతుల అడుగులు
ఏడీబీ రుణంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు మార్గం సుగమం
విశాల తీరం.. చుట్టూ సహజ వనరులు వీటన్నిటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ప్రభుత్వం జిల్లాలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటులో చురుగ్గా అడుగులు వేస్తోంది.ఒకప్పుడు అసలు భూములే ఇవ్వబోమంటూ ఆందోళన బాటపట్టిన రైతులు ఆ తర్వాత ధరకోసం పోరాటం చేశారు. ప్రస్తుతం కొంత సానుకూల ధోరణి కనబరుస్తూ, భూములిచ్చే వైపు అడుగులు వేస్తున్నారు. పాలకులు, అధికార యంత్రాంగం చూపిన చొరవ కారణంగా త్వరలోనే ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అడుగుపడనుంది. ప్రస్తుతం ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే వీలైనంత వేగంగా పరిశ్రమలను నెలకొల్పడమే లక్ష్యంగా కనిపిస్తుంది. నక్కపల్లి మండలంలో పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

నక్కపల్లి, న్యూస్‌టుడే
కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో 2010లో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ జారీచేసింది. దీన్ని అప్పట్లో ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలో ఏపీఐఐసీ అధికారులు మాత్రం నోటీసులు జారీ చేసి వూరుకున్నారు. అప్పట్లో రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, అమలాపురం, వేంపాడు, డీఎల్‌పురం తదితర రెవెన్యూ ప్రాంతాల పరిధిలో దాదాపు 4000 ఎకరాల భూమిని తీసుకోడానికి ప్రాథమికంగా ప్రతిపాదన తయారు చేశారు. దాదాపు నాలుగేళ్ల కాలంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు కదలికలు జరిగినా అవేమీ పట్టాలెక్కలేదు. భూములివ్వడానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నాయకులంతా కలిసి కోర్టుకి వెళ్లడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరోవైపు ఇదే సమయంలో తీనార్ల నుంచి గునుపూడి వరకు ఉన్న …మిగతా 7లో

గ్రామాలను ఆనుకుని అదనంగా మరో 2000 ఎకరాలను తీసుకోడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పారిశ్రామీకికరణ తప్పదని గుర్తించింది. కేంద్రం సైతం అవసరమైన సాయం అందించడానికి ముందుకు వచ్చింది. దీన్లో భాగంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇందులో వివిధ రకాల రసాయన, పెట్రో ఉత్పత్తుల, లోహ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకుగాను భూముల అవసరం తప్పనిసరి. ఫలితంగా గతంలో గుర్తించిన భూములను తీసుకోవడం తథ్యమని భావించింది. ఆమేరకు ఏడాది కాలంపైబడి భూసేకరణకు చర్యలు చేపట్టింది. రైతులను బుజ్జగిస్తూనే పావులు కదిపింది. ఈ సందర్భంలో పలుమార్లు రైతులు, నాయకులతో అధికారులు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భూములకు తగిన పరిహారం అందించడంతోపాటు, ఉపాధి, ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు. అయితే దీనిపై భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అంగీకారం తెలపకపోయినా, అధికారులు తమదైన శైలిలో పావులు కదిపారు. దీంతో పలు సమావేశాల అనంతరం ఎకరా జిరాయితీ భూమికి రూ. 18లక్షలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అంతేకాకుండా ఇందులో చెట్లు, భవనాలు ఇతరాత్ర ఏమున్నా, వాటికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఇక డీఫాం భూములున్నవారికి, పట్టాల్లేకపోయినా ప్రభుత్వ భూములను సాగు చేసుకున్నవారికి తగిన పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా రైతులు సందిగ్ధంలో పడ్డారు. దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నా, చాలామంది లోపాయికారిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు రాజయ్యపేట, బోయపాడు ప్రాంతాల్లో ఉన్న జిరాయితీ భూముల రైతులు అంగీకారం తెలపడంతో వారికి అధికారులు చెల్లింపులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వ భూములను సర్వే చేస్తూ డీఫాం పట్టాల రైతులు అందుబాటులో ఉండాలని లేకపోతే పరిహారం అందే పరిస్థితి ఉండదని ప్రకటించడంతో వీరంతా ముందుకు వచ్చారు. తొలివిడతలో నక్కపల్లి మండలంలో దాదాపు 2000 ఎకరాల్లో సర్వేచేసి అర్హుల గుర్తింపు చేపడుతున్నారు. ఇది నెలాఖరుకి పూర్తికానుంది. అంతేకాకుండా పరిహారం చెల్లించడానికి నిధులు కొరత లేదని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పట్లో పరిహారం పొందినప్పటికి భూములు తక్షణమే తీసుకోవడం జరగదని, అంతేకాకుండా పొందిన పరిహారానికి ఏడాదికో, రెండేళ్లకో వడ్డీ లెక్కించుకున్నా భారీగా సొమ్ము చేరడంతోపాటు, సాగుద్వారా తగిన ఆదాయం వస్తుందని ఉన్నతాధికారులు చేసిన ప్రకటన అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఆందోళనబాటలో నడిచిన వారు గతంలో ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు ప్రదర్శించకపోవడం భూములివ్వడానికి సిద్ధమవుతున్నారన్న సంకేతాన్నిస్తుంది.

ఏడీబీ సహకారం
విశాఖ చెన్నై కారిడార్‌ ఏర్పాటుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) తగిన సహకారం అందించడానికి రెండేళ్ల క్రితమే ముందుకు వచ్చింది. ఆమేరకు 6వేల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కారిడార్‌ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్తు వ్యవస్థని ఏర్పాటు చేయడానికి రూ. సుమారు 1100కోట్ల వరకు ఏడీబీ సమకూరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా జిల్లాలో కాపులుప్పాడ, ఓజోన్‌వ్యాలీ, అచ్యుతాపురం, నక్కపల్లి, ప్రాంతాల్లో ప్రత్యేకంగా విద్యుత్తు వ్యవస్థ కేంద్రాల నిర్మాణం చేయనున్నారు. వీటికి సంబంధించి గతంలోనే విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో సర్వేలు చేసి స్థలాలను గుర్తించారు. భూముల కేటాయింపు కొలిక్కి వచ్చేసరికి పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయలను సిద్ధం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆమేరకు ఎల్‌అండ్‌టీ సంస్థ ద్వారా ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేయిస్తున్నారు. ఇందులో పరిశ్రమలు ఎక్కడెక్కడ వస్తాయి? గ్రామాల పరిస్థితి? వాటిచుట్టూ చేపట్టే అభివృద్ధి? గ్రామాలను తరలించే పరిస్థితి వస్తే వాటికి పత్యామ్నాయం? పార్కులు? ఇలా అన్ని అంశాలు ఇందులో పొందుపరిచి ప్రభుత్వానికి అందివ్వనున్నారు.

అందర్నీ ఆదుకోవాలి

అభివృద్ధి కావాలని కోరుకుంటున్నవారు ఎక్కువగానే ఉన్నా భూములను కోల్పోయేవారికి సరైనా న్యాయం జరిగేలా చూడటంతోపాటు వ్యవసాయాధారంగా బతికే ఇతర చేతి, కులవృత్తుల వారి పరిస్థితి కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న వారు పరిశ్రమల ఏర్పాటు తర్వాత తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సందేహాలను పూర్తిగా నివృత్తిచేయాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. ఈవిషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆమేరకు యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఇప్పటికే వివిధ రకాల విద్యాసంస్థల ఏర్పాటు జరుగుతున్నా, పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విద్యాసంస్థలను నెలకొల్పగలిగితే ప్రభుత్వంపై మరింత నమ్మకం ఏర్పడుతుంది. పరిశ్రమల ఏర్పాటు జరిగితే మాత్రం కచ్చితంగా ఈ ప్రాంతానికి పారిశ్రామిక, అభివృద్ధి పటంలో తగిన చోటు లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ పరిశ్రమలు, అదే విధంగా పర్యటక ప్రాంతాలు, ఆరు వరుసల రహదారి తదితర ఏర్పాటు సమాంతరం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం.

Source : http://www.eenadu.net/