News

Realestate News

అబ్కారీ.. అడ్డదారి!

అబ్కారీ.. అడ్డదారి!
కల్తీ మద్యంపై కన్నెత్తి చూడరు
కాసుల కోసం సీసాలనే మార్చేస్తున్నారు!
గంజాయి అక్రమ రవాణాలోను ఘనచరిత్రే
గాడితప్పుతున్న ఎక్సైజ్‌ శాఖ
పట్టుబడింది 20 శాతమే..
అబ్కారీ శాఖలో అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారుల్లో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సొంత లాభం కోసం నీతిమాలిన వ్యాపారాలను తెరవెనకుండి ప్రోత్సహిస్తున్నారు. గంజాయిని సరిహద్దులు దాటించడంలో.. ఖరీదైన మద్యాన్ని చీప్‌ లిక్కర్లతో కల్తీ చేయించడంలో కొందరు అబ్కారీ అధికారుల పాత్ర  వెలుగు చూస్తుండటంతో ఆ శాఖ పనితీరు విమర్శలకు తావిస్తోంది.

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే నిఘావిభాగం
ఏజెన్సీలో సుమారు 10వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో గంజాయి సాగవుతోందని అధికారికంగానే చెబుతున్నారు. వీటి నుంచి ఏటా మూడు లక్షల టన్నులపైనే గంజాయి బయటకు వస్తోంది. అయితే ఏటా ఎక్సైజ్‌, పోలీసు, డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో 80 వేల నుంచి లక్ష క్వింటాళ్లకు మించి పట్టుబడడం లేదు. వీటినే గొప్పగా చెబుతుంటారు. పండిన గంజాయిలో పట్టుబడింది 15 నుంచి 20 శాతంగానే ఉంటోంది. మిగతా 80శాతం గంజాయి ఎక్కడికి ఎలా తరలిపోతుందో చెప్పలేకపోతున్నారు. కాకిలెక్కలు వేసి అంతేనని నమ్మబలికేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారుల సహకారం లేకుండా అంత పెద్దమొత్తంలో గంజాయి జిల్లా సరిహద్దులు దాటడం సులువేమీ కాదు. గతంలో పాడేరు సీఐగా పనిచేసిన శ్రీనివాసరావు నేరుగా స్మగ్లర్లతోనే సంబంధాలు నెరిపినట్లు బలమైన ఆధారాలు ఆ శాఖ వద్దే ఉన్నాయి. దీంతో ఆయన్ని సస్పెండ్‌ చేసి కేసు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. గాజువాక మాజీ ఏఈఎస్‌ రవీందర్‌ ప్రసాద్‌, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గంజాయి అక్రమ రవాణాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సస్పెండ్‌ చేశారు. పట్టుబడిన వారిచ్చిన సమాచారం ఆధారంగా వీరిపై నిఘాపెట్టి క్రమశిక్షణా చర్యలు
తీసుకున్నారు. నిఘాకు దొరకని అధికారులు ఇంకా ఉన్నారని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి.

*మద్యం దుకాణాల పరిశీలన, గొలుసు దుకాణాలు, గంజాయి రవాణాపై నిఘా పెట్టాల్సిన అధికారులు అమ్యామ్యాల మత్తులో మొద్దు నిద్ర నటిస్తుండడడంతో రూ.కోట్ల గంజాయి జిల్లా సరిహద్దులు దాటిపోతోంది.. కల్తీ మద్యం ఏరులై పారుతోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడు నామమాత్రపు తనిఖీలతో చేతులు దులిపేసుకుంటున్నారు మినహా పనితీరుని సమీక్షించుకోవడం లేదు.

*గంజాయి రవాణాతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇప్పటికే జిల్లాలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌) అధికారి ఒకరిని, సీఐ ఒకర్ని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. కల్తీ మద్యం వ్యవహారంలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే కారణంతో ఇటీవల ఎలమంచిలి సీఐని సస్పెండ్‌ చేశారు. వీరే కాదు అబ్కారీ శాఖలో మరికొంత మంది అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గంజాయి తోటల ధ్వంసానికి ముందు కొంతమంది అబ్కారీ అధికారులు స్మగ్లర్లతోనే నేరుగా సంబంధాలు పెట్టుకుని ఏజెన్సీ నుంచి సాఫీగా గంజాయిని తరలించడానికి సహకరించేవారు.

* జిల్లాలో ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌, ఒడిశాల నుంచి మూతలను తెప్పిస్తూ మద్యం కల్తీకి పాల్పడుతున్నారు. విచారణలో ఈ విషయం వెల్లడైంది. గ్రామీణ జిల్లాలో మొదటి నర్సీపట్నం నుంచి మొదలైన కల్తీ మద్యం వ్యాపారం జిల్లా అంతటా విస్తరించింది. ఇప్పుడు అనకాపల్లి లిక్కర్‌ కింగ్‌లకు కేంద్రంగా వర్థిల్లుతోంది. అనకాపల్లికి చెందిన ప్రధాన వ్యాపారి ఒక బినామీ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని అధికారులకు కాసులు అందిస్తూ తానూ కోట్లాది రూపాయలు సంపాదించారని ప్రచారం జరుగుతుంది.

అదనంగా మామూళ్లు..
కల్తీ మద్యం వ్యాపారం ద్వారా కోట్లకు పడగెత్తిన మాఫియా ప్రతినిధులు ఈ వ్యాపారంలోకి కొత్తగా వచ్చిన వారితో మంచిగా ఉన్నట్లే నటించి వారిని అధికారులతో పట్టించేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలోకి ఎక్కువమంది ప్రవేశిస్తే విషయం బహిర్గతమవుతుందనే భయంతో కొత్తవారిపైౖ దాడులు నిర్వహిస్తుంటారనే ఆరోపణలూ ఉన్నాయి. అనకాపల్లి పరిధిలో పనిచేసే ఓ పోలీసు అధికారికి రెండు మద్యం దుకాణాలు ఉన్నాయని, ఆయనా ఈ కల్తీ వ్యాపారానికి సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ వ్యాపారం చూసీచూడన్నట్లు వ్యవహరించిన అధికారులకు సాధారణ మామూళ్లతోపాటు అదనంగా ప్రతి దుకాణానికి నెలకి రూ.35వేల నుంచి రూ.50వేలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఈ దందా జరుగుతున్నా లోతైనా విచారణ జరపకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా..
అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన మద్యం వ్యాపారి కల్తీకి ఉపయోగించే మూతలను హైదరాబాద్‌ నుంచి రప్పిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పరవాడలోని ఫార్మా కంపెనీలకు సరకు రవాణా చేసే లారీలో మూతలను తరలిస్తున్నారని తెలిసింది. 60వేల మద్యం సీసా మూతలు ఒకేసారి అధికారులకు దొరికాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

మూతల మార్పు ఇలా..
కల్తీ మద్యం వ్యాపారం ఖాళీ సీసాల సేకరణతో ప్రారంభమవుతుంది. ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను ముందుగా బ్రాండ్‌ల వారీగా సేకరిస్తారు. సేకరించి వాటిలో చీప్‌లిక్కర్‌ని నింపి సంపాదించిన కొత్త మూతలు బిగిస్తూ కల్తీకి తెరతీస్తున్నారు. హెచ్‌డీ అనే బ్రాండ్‌ చీప్‌లిక్కరు అన్నిరకాలైన ఇతర బ్రాండ్‌ల్లోనూ కలిసిపోయే స్వభావం ఉండడంతో మిగిలిన వాటిలో సులభంగా కలుపుతున్నారు. బ్రాండ్‌ మిక్సింగ్‌ చేయడానికి గ్రామీణ జిల్లాలో సబ్బవరం, మాకవరపాలెం, చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో 300మంది యువకులు నైపుణ్యం సంపాదిస్తూ దీనిని ఉపాధిగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఒక్కొక్క కేసుకి రూ.100లు వరకు వీరికి మద్యం వ్యాపారులు చెల్లిస్తారు. చీప్‌లిక్కరును కౌంటర్‌లో సేల్‌ చూపించకుండా కల్తీ చేస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారులకు తెలిసినా.. గొలుసు దుకాణం, అదనపు సమయాలు వంటి వాటికి అందించే మామూళ్లతోపాటు బ్రాండ్‌ మిక్సింగ్‌కు ఇచ్చే మామూళ్లు అధికం కావడంతో ఈ వ్యాపారాన్ని దగ్గరుండీ మరీ ప్రోత్సహిస్తున్నారు. అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్న కల్తీకి  ఉపయోగించే కప్పుల వ్యాపారం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు విస్తరించింది. మద్యం సీసా మూతల రవాణా బాగోతం శ్రీకాకుళంలో వెలుగుచూడడంతో ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో పట్టుకున్నారని తెలిసింది.

దందా నడిపిస్తున్నారు..
గ్రామీణ జిల్లాలో పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది ఒకే బ్యాచ్‌కు చెందిన వారు సీఐలుగా ఉన్నారు. వీరిలో కొందరు ఈ దందాను నడుపుతున్నట్లు తెలిసింది. వారిలో ఓ సీఐ ఇటువంటి దందాలతో ఏకంగా రూ.కోటి విలువచేసే గృహాన్ని ఈమధ్య కాలంలోనే నిర్మించినట్లు సమాచారం. ఎలమంచిలిలో మద్యంలో నీళ్లు కలిపి మూతలు మారుస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ నుంచి వచ్చిన బృందం దాడి చేసి మద్యం దుకాణాన్ని సీజ్‌ చేశారు. కొద్ది నెలలు తరువాత తూతూమంత్రంగా విచారణ పూర్తిచేసి దుకాణాన్ని తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చేశారు. ఆ దుకాణదారున్ని కోర్టును ఆశ్రయించమని సలహాలు ఇచ్చిన ఘనత ఎలమంచిలి అబ్కారీ శాఖలో కొందరు అధికారులకు దక్కుతుంది. ఇటీవల పదవీవిరమణ చేసిన జిల్లా అధికారికి ఫంక్షన్‌ చేయడానికి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నుంచి రూ.12వేలు చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడు పట్టుకున్నా విచారణ గాలికే..
రెండేళ్ల క్రితం అనకాపల్లిలో ఒడిశా డిస్టలరీకి చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. ఇది మునగపాకకి చెందిన వైకాపా ముఖ్యనాయకుడికి చెందిన సరకుగా గుర్తించారు. ఈ కేసులో వ్యాన్‌ డ్రైవర్‌ ఒక్కరిని మాత్రమే అరెస్ట్‌ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు.  డ్రైవర్‌ ఒక్కరే ఈ వ్యాపారం చేయలేడు.. దీని వెనుక చాలామంది ప్రముఖలు, పెద్ద వ్యాపారులు ఉంటారని తెలిసినా ఇప్పటికీ దీనిపై జరిగిన విచారణ కూడా వెలుగుచూడలేదు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమపద్ధతిలో దిగుమతి చేసుకుంటూ ఖరీదైన మద్యం సీసాల్లో కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. ఈ వ్యాపారం నేనే చేస్తున్నానని లొంగిపోయిన అనకాపల్లికి చెందిన బినామీ వ్యాపారికి మద్యం, కల్తీకి ఉపయోగించే కప్పులు ఎక్కడ నుంచి వస్తున్నాయని? దీని వెనుక ఎవరు ఉన్నారు? కల్తీకి  ఇప్పటివరకు సహకరించిన అబ్కారీ శాఖ అధికారులు ఎవరు? ఎంతకాలం నుంచి ఏయే ప్రాంతాలకు వీటిని అందించారు అనే విషయాలపై అధికారులు నోరువిప్పడం లేదు. కల్తీకప్పుల వ్యాపారం వెలుగుచూసిన తరువాత ఒక్క మద్యం దుకాణాన్ని మాత్రమే అధికారులు సీజ్‌ చేశారు.  ఇప్పటివరకు కల్తీ కప్పులతో వ్యాపారంచేసిన ఏ దుకాణం మీదా చర్యలు తీసుకోలేదు.

కల్తీ మద్యం  ఏరులై పారుతోంది..
మద్యంలో కల్తీని అరికట్టాల్సిన ప్రొహిబిషన్‌ శాఖ అధికారులే కల్తీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన మద్యం సీసాల్లో చవక (చీప్‌లిక్కర్‌) మద్యాన్ని కలిపేసి.. మూతలు మార్చి దర్జాగా విక్రయిస్తున్నారు. ఇటీవల అనకాపల్లి ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కిన మద్యం సీసాల మూతల వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అనకాపల్లి కేంద్రంగా సాగుతున్న మూతల మార్పిడి వ్యవహారాన్ని చాలా చిన్న సంఘటనగా చూపిస్తూ ఎలమంచిలి సీఐ జయరామిరెడ్డిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు.

జయరామిరెడ్డి  (ఇటీవల సస్పెండ్‌కు గురైన ఎలమంచిలి ఎక్సైజ్‌ సీఐ)

కొందరి వ్యవహారంతోనే చెడ్డపేరు
ఎక్సైజ్‌ శాఖలో కొంతమంది పనితీరు వల్ల మొత్తం శాఖకు చెడ్డపేరు వస్తోంది. అలాంటి వాళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. మద్యం దుకాణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఎన్‌ఫోర్స్‌మెంట్‌దే కాదు సంబంధిత ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ అధికారులకు ఉంది. వారు కొంతమేర నిర్లక్ష్యం చేయడంతో ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది రూ.కోట్ల విలువ చేసే గంజాయి బయటకురాకుండా మొక్క దశలోనే నాశనం చేశాం. ప్రస్తుతం గంజాయి రవాణాను అడ్డుకోవడంపై దృష్టి సారిస్తున్నాం. మేం పూర్తి చిత్తశుద్ధితోనే విధులు నిర్వహిస్తున్నాం. ఎవరో ఒకరిద్దరు చేసిన పనిని మొత్తం శాఖకు ఆపాదించడం కరెక్టుకాదు. మూతల మార్పిడి కేసుపై విచారణ ఇంకా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏఈఎస్‌ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించాం. ఈ వ్యవహారంతో త్వరలోనే తేలుతుంది.

బాబ్జీరావు, ఇన్‌ఛార్జి ఉప కమిషనర్‌, ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌