News

Realestate News

అప్పన్న నిజరూపం అద్భుత దివ్యతేజం…

సింహగిరిపై రేపు చందనోత్సవం

విశ్వ కల్యాణార్థం శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాల్లో నృసింహావతారం విశిష్టమైనది… విలక్షణమైనది. కరుణ, క్రౌర్యం, ప్రసన్నత, ఉగ్రత్వం పరస్పర విరుద్ధమైన గుణాలు కలిగిన అవతారం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ధరించాడు స్వామి. ప్రహ్లాదుడి పిలుపువిని శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిగా సింహగిరిపై కొలువుదీరిన సిరిగల దేవుడు అప్పన్న స్వామి. సంవత్సరమంతా చందనంలో ఉండి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తాడు.

-న్యూస్‌టుడే, సింహాచలం, అడివివరం

సింహాచలానికి ఆపేరెలా వచ్చింది…
సింహాచలం కొండ సింహం ఆకారంలో ఉన్నందున సింహాచలం అనే పేరు వచ్చిందని క్షేత్రమహాత్యా్మం ద్వారా తెలుస్తోంది. ఈ కొండను ఆధ్యాత్మికవాదులు పంచ జ్ఞానేంద్రియాలను అదుపు చేసుకోగల శక్తి ఉన్న పర్వతమని వర్ణిస్తారు.

సింహాచలాన్ని మించిన క్షేత్రం లేదు
భూమండలంలో ఉన్న నాలుగు నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఎంతో విశిష్టమైనది. దేశంలో కృతశౌచం, హరంపాపం, అహోబలం, సింహాచలం ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో సింహాచలానికి ఉన్న విశిష్టత, విలక్షణత ఏ క్షేత్రంలోనూ కనిపించదు. సింహాచలం పర్వతం పైనుంచి ప్రహ్లాదుడిని సముద్రంలోకి పడవేసినప్పుడు శ్రీహరి కాపాడాడు. అందుకే సింహాచలం అత్యంత ప్రముఖ క్షేత్రం. ఈ నాలుగు క్షేత్రాలతో పాటు అంతర్వేది, శోభనాద్రి, మంగళాద్రి, వేదాద్రి, కాద్రి, యాదగిరి, ధర్మపురి, మత్స్యకుండం, కూర్మకుండం క్షేత్రాలు హరి నివాసాలుగా ప్రసిద్ధి చెందాయి. మత్స్య, కూర్మాలకు జలాలు… వరాహం ఇష్టపడే నీటి పడియలు… నరుడికి జనపదాలు… సింహానికి గిరి, గురి, గుహలు కావాలి. ఈ నాలుగు అవతారాలకు కావాల్సిన జల, గిరి, వన, జనపదాలన్నీ ఉన్నది సింహాచలం క్షేత్రం ఒక్కటే.

నిత్య నూతనం… సింహాద్రీశుని స్వరూపం
మధ్యే వాలేచ సింహం కఠిమదలపనే శేషగాత్రే నరంత్వాం।
పాతాళే గుప్తపాదం శశి కుముద సుధా స్వచ్ఛ గాత్రం త్రినేత్రం।
గృహ్నంతం సవ్యహస్తే కఠి కనకపటీం దక్షిణే పక్షిరాజం।
త్రేధా వక్త్రం శరణ్యం శరణముపగతాః సంతరేయం భవాబ్ధిం॥
ప్రహ్లాదుడి కోరిక మేరకు ద్వయ రూపాలతో సింహగిరిపై వెలసిన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి రూపవర్ణన ఇది. ముఖమునందు వరాహ రూపాన్ని, దేహమునందు నరాకృతిని కలిగి సింహవాలము… త్రినేత్రము ద్విభుజుడై… పౌర్ణమి చంద్రుని వలె శ్వేతవర్ణ దేహకాంతితో… కుడిచేతి బొటనవేలితో గరుత్మంతునికి అమృతపానం చేస్తూ… భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాలనే ఆత్రంతో వస్తున్న స్వామి జారుతున్నపీతవస్త్రాన్ని ఎడమచేతితో పట్టుకుని ముచ్చటైన మూడు వంకలు కలిగిన త్రిభంగి లాలిత్యంతో దివ్యసుందర ఆహ్లాదకరమైన విశిష్టరూపం… సింహగిరి నరహరిది. ఏడాదంతా సుగంధ పరిమళ చందనంలో నిత్యరూపంతో ఉండే స్వామి భక్తులను కటాక్షించేందుకు ‘అక్షయ తృతీయ’ నాడు ఒక్కరోజు మాత్రమే నిజరూపంతో విశ్వరూప సందర్శన భాగ్యం కలిగిస్తున్నాడు. అంతటి మహిమాన్వితమైన స్వామిని అయిదు దశాబ్దాల పాటు సేవించి తరించే భాగ్యాన్ని పొందిన అప్పన్న ఆలయ విశ్రాంత ప్రధాన పురోహితులు, రాష్ట్ర ఆగమ సలహా మండలి సభ్యులు మోర్తా సీతారామభట్టాచార్యులు తమ అనుభవాలను, స్వామిని సేవించి తరించిన అనుభూతులను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

అప్పన్నకు ప్రీతి సంపెంగలు
సంపెంగలు ఎక్కడ కనబడ్డా సింహాచలమే గుర్తుకు వస్తుంది. సింహాచలం అనగానే పచ్చి చందనం మనసులో గుబాళిస్తుంది. చందనపు చలువ తావులు ముక్కు పుటాలను సోకగానే చందనంలో వేంచేసి ఉన్న అప్పన్న స్వామి సాక్షాత్కరిస్తాడు. సింహాచలంలో సంపెంగలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకప్పుడు సింహగిరిపై బల్ల సంపెంగ, రేకు సంపెంగ, పసుపు, ఎరుపు, తెలుపు సంపెంగలు, నాగ సంపెంగ వృక్షాలు ఉండేవి. స్వామి మెడలో సంపెంగ మాల వేసి ఆరాధించాలని భక్తులు ఆరాటపడతారు. ఈ నేపథ్యంలోనే ఒకదాత ఇక్కడి పచ్చి సంపెంగ పువ్వులను అమెరికా తీసుకెళ్లి అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో స్వర్ణ సంపెంగ పుష్పాలు తయారు చేయించి స్వామికి బహూకరించాడు. ఆ పుష్పాలతోనే ప్రతి గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం జరగడం విశేషం.

అప్పన్నను మెప్పించిన ఇద్దరు…
సింహాచలం క్షేత్రంలో శ్రీకాంత కృష్ణమాచార్యులు, గోగులపాటి కూర్మనాథ కవి అప్పన్న స్వామిని సాక్షాత్కరింప చేసుకున్న గొప్ప కవులు. పుట్టు గుడ్డివాడైన కృష్ణమయ్య స్వామి కటాక్షంతో చూపును పొంది స్వామిపై నాలుగు లక్షల సంకీర్తనలు, వచనాలు రచించాడు. ఆయన కీర్తనలకు స్వామి బాలుడి రూపంలో వచ్చి నాట్యమాడాడని చరిత్ర చెబుతోంది. ఈయన సంకీర్తనలతో స్వామిని మెప్పిస్తే గోగులపాటి కూర్మనాథ కవి ఆలయ ఉద్యోగి అయినప్పటికీ తన సింహాద్రి నారసింహ శతకంతో స్వామిని మేల్కొలుపుతాడు. క్రీ॥శ॥ 1753లో తురుస్కులు దేవాలయాన్ని కొల్లగొట్టడానికి వస్తున్నప్పుడు కూర్మనాథుడు ఆలయం తలుపులు మూసివేసి సింహాద్రి నారసింహ శతకంతో స్వామిని మేల్కొలుపుతాడు. వైరిహర రంహ సింహాద్రి నారసింహ అన్న మకుఠంతో ఉన్న శతకంతో కూర్మనాథుడు స్వామిని వేడుకుంటాడు. దీంతో ఆలయంలో నుంచి కంచు తుమ్మెదలు బయలుదేరి దుండగులను నగరం నడిబొడ్డున ఉన్న తుమ్మెదల మెట్ట (ప్రస్తుత కాన్వెంట్‌ కూడలి) వరకు తరుముతాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని తుమ్మెదలమెట్టగా వ్యవహరిస్తున్నారు.

నిజరూపం… విశ్వరూపమే… : శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి అత్యద్భుత అవతారం. స్వామికి మంత్రమూర్తి ఆరాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. స్వామిని దర్శించుకోవాలన్నా… అర్చించాలన్నా… భక్తితో పాటు ఉపాసన బలం కలిగివుండాలి. చందనయాత్ర నాటి స్వామి నిజరూపాన్ని పెద్దలు విశ్వరూప సందర్శనగా పేర్కొన్నారు. నిజరూపంలో స్వామి చాలా కురచగా కనిపిస్తాడు. అంతచిన్న రూపంలో ఉండే స్వామిని భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంత మనోనేత్రంతో దర్శించుకుంటే విశ్వరూపంగా కనిపిస్తాడు. చల్లని తండ్రి చందనస్వామి శ్రీగంధం అలంకారం లేకుండా అసలు ఉండలేడు. అందుచేతనే చందనోత్తరణం జరిగిన తక్షణమే స్వామికి ఎద, శిరసుపై చందనపు ముద్దలను పెట్టడం జరుగుతుంది.

నిత్య నూతనం… అప్పన్న రూపం : 12మణుగుల చందనంలో ఒదిగిపోయిన స్వామిని ప్రతిరోజూ చూసినా తనివితీరదు. అయిదు దశాబ్దాలు స్వామిని సేవించినా ఇప్పటికీ తనివితీరలేదు. పున్నమి చంద్రుడిని తలదన్నే శ్వేతవర్ణంతో కొన్ని గంటల పాటు నిజరూపంలో సుందరంగా కనిపించే స్వామి… నిత్యరూపంలో సైతం రోజుకో కళతో అనుగ్రహిస్తాడు. నిజరూప దర్శనం అనంతరం తొలిసారిగా సమర్పించిన మూడు మణుగుల చందనంలో గుమ్మడిపండు ఆకారంలో స్వామి కనిపిస్తాడు. అలాగే రెండోసారి చందన సమర్పణ తర్వాత ఆరు మణుగుల్లో ఒకలాగ… మూడో విడత తర్వాత తొమ్మిది మణుగుల్లో మరోలా… చివరి విడత గంధంలో పన్నెండు మణుగుల్లో ఇంకోలా కనిపిస్తూ నిత్య నూతనంగా చందనశోభితుడై భక్తులను అనుగ్రహిస్తాడు. ఇది ప్రతి భక్తుడు అనుభవంలో తెలుసుకోవాల్సిన అద్భుత అనుభూతి.

త్రినేత్రుడు… శాంతమూర్తి : వరాహ నృసింహుడు గంధంలో ఉంటూ శాంతమూర్తిగా అవతరించినత్రినేత్రుడు. చందనయాత్ర రోజు అప్పన్న ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. పూర్వం రోజుల్లో ఆలయంలో ఉండే వారికి చెమట ధారాపాతంగా వచ్చేది. స్వామి నిజరూపంలో ఉండగా ఆలయంలోని గోడలు చెమ్మగిల్లుతాయి. ప్రస్తుతం సాంకేతికత పేరుతో శీతల యంత్రాలను ఏర్పాటు చేయడంతో ఆ అనుభవానికి దూరమయ్యాం. ఈ యంత్రాలు లేకపోతే నేడూ ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చని సీతారామభట్టాచార్యులు చెప్పారు.

పవిత్రకార్యం… చందనోత్తరణం : సుమారు 480కిలోల సుగంధ పరిమళ శ్రీగంధంలో సేదతీరుతున్న స్వామిని నిజరూపంలోకి తీసుకురావడానికి చేసే చందనోత్తరణం అత్యంత పవిత్రమైన కార్యం. నిత్యం స్వామిని సేవించే అర్చకులు సైతం ఎప్పుడుపడితే అప్పుడు స్వామిని తాకేందుకు శాస్త్రం అంగీకరించదు. అందుకు చందనోత్తరణ సమయంలో అర్చకులు స్వామిని తాకి అపచారం చేస్తున్నామన్న భావనతో మెలగుతారు. చందనాన్ని స్వామి నుంచి వేరు చేసే ముందు ఆయన దేహాన్ని తాకుతున్నందుకు క్షమించమని కోరుతూ ప్రార్థన చేయాలి. భూ, వరాహ మంత్రాలు పఠించి స్వామి అనుజ్ఞ పొందాలి. పసిపాపకు సపర్యలు చేసినంత సున్నితంగా… తెరమాటున రహస్యంగా… పవిత్రంగా స్వామిని చేతితో స్పర్శించకుండా వెండి బొరిగెలతో చందనోత్తరణం చేస్తారు.

జ్ఞక్షతిగుప్త పాదుడు… వరాహ నృసింహుడు: క్షితిగుప్త పాదః… సింహాచలే జయతి… దేవవరో నృసింహః అని చెబుతోంది సింహాచలం క్షేత్రమహాత్యా్మం. భూమిలోనికి చొచ్చుకుపోయిన పాదాలు కలిగినవాడు ఇక్కడి స్వామి. భక్తశిఖామణి ప్రహ్లాదుడిని రక్షించేందుకు వైకుంఠం నుంచి వేగంగా వస్తున్న స్వామి సింహగిరిపై ఒక్క ఉదుటున దూకడంతో పాదాలు భూమిలోనికి చొచ్చుకుపోయాయంటారు. అందుకే నిజరూప దర్శనంలో కూడా స్వామి పాదాలను దర్శించే భాగ్యం భూలోకవాసులకు లేకుండా పోయింది.