News

Realestate News

అన్నదాతా సుఖీభవ

అన్నదాతా సుఖీభవ
అన్నక్యాంటీన్లకు పోటెత్తిన జనం
భోజనం బాగుందంటూ ప్రశంసలు
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 10 మంది విద్యార్థులు క్యాంటీన్లలో స్వచ్ఛంద సేవలందించారు.
తొలిరోజు అక్షయపాత్ర సిబ్బంది ఆయా క్యాంటీన్లలో సేవలు అందించారు. గురువారం నుంచి క్యాంటీన్ల సిబ్బందే నిర్వహణ చూసుకుంటారు.
తొలిరోజు ఎంవీపీకాలనీ, విమ్స్‌, మర్రిపాలెం క్యాంటీన్లలో మాత్రమే అల్పాహారం అందించారు.
ప్రాంతీయ కంటిఆసుపత్రి వద్ద క్యాంటీన్‌లో భోజనం చేసిన ఓ జంట పేదలకు ఇలాంటి పథకం చాలా ఉపయోగపడుతుందని ప్రశంసిస్తూ రూ. 100 విరాళం అందించింది.
చాలా కేంద్రాలకు నిరుపేదలు కుటుంబాలతో వచ్చారు. మధ్యాహ్నం ఒంటిప్రాంతానికి క్యాంటీన్లన్నీ కిక్కిరిసిపోయాయి. మూడు గంటలు దాటినా జనం ఉండడంతో అందరికీ సరిపడేలా అక్షయపాత్ర సిబ్బంది భోజనాలు సమకూర్చారు.
అన్నిచోట్ల నుంచీ భోజనం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు వచ్చాయి.

న్యూస్‌టుడే – కార్పొరేషన్‌:
భవన నిర్మాణ కార్మికులు.. ఆటో డ్రైవర్లు.. కూలీలు.. నిరుపేద కుటుంబాలవారితో అన్న క్యాంటీన్లు కిక్కిరిసిపోయాయి. బుధవారం నగరంలో 18 చోట్ల వీటిని అధికారికంగా ప్రారంభించారు. తగరపువలసలోని చిట్టివలస వద్ద మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంటీన్ల వద్ద ఆహారం కోసం జనం పోటీపడ్డారు. మధ్యాహ్నం, రాత్రి పూట లక్ష్యానికి మించి ఆహార పదార్థాలను అందించినట్టు అక్షయపాత్ర ప్రతినిధులు తెలిపారు.

పేదలు, వివిధ పనులపైనా, ఉపాధి, ఉద్యోగరీత్యా వచ్చినవారంతా మధ్యాహ్నానికి అన్న క్యాంటీన్ల వద్దకు చేరుకుని, రూ. 5 చెల్లించి ఆహారం తీసుకుని సంతృప్తికరంగా అక్కణ్నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఇళ్లల్లో పనిచేసుకునేవారు, ఆటో కార్మికులు, క్షేత్రస్థాయిలో తిరిగేవారు, ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనులపై వచ్చినవారితో క్యాంటీన్లు కిక్కిరిసి కనిపించాయి. ప్రాంతీయ కంటి ఆసుపత్రి వద్ద రద్దీని నియంత్రించడానికి పోలీసులు కూడా రావాల్సి వచ్చింది. ఉదయం ఎంవీపీకాలనీలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అల్పాహారం అందించారు. మధ్యాహ్నం, రాత్రి ఒక్కో కేంద్రంలో సాధారణ లక్ష్యం 300 మంది కాగా, ప్రారంభోత్సవం సందర్భంగా 450 మంది నుంచి 600 మందికి ఆహారం అందించినట్లు అక్షయపాత్ర ప్రతినిధులు తెలిపారు. రాత్రి 250 లక్ష్యానికి గానూ 300 మందికి సరిపడా ఆహారాన్ని సరఫరా చేయగా, కొన్ని కేంద్రాల్లో ఆహారం మిగిలిపోయిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3.30 వరకు, రాత్రి 7.30 నుంచి 9  గంటల వరకూ ఆహారాన్ని సరఫరా చేశారు.

ఇదీ అన్న క్యాంటీన్‌ లెక్క…: అన్న క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం రూ. 5కే ఆహారం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఒక వ్యక్తికి రూ. 15లతో రోజు గడిచిపోతుండగా, తీసుకుంటున్న ఆహారానికి అయ్యే ఖర్చు రూ. 63గా ప్రభుత్వం నిర్ధరించింది. రూ.15 మినహాయించగా, ఒక్కో వ్యక్తికి రూ. 58 చొప్పున ప్రభుత్వమే రాయితీగా భరిస్తోంది. మధ్యాహ్న, రాత్రి భోజనంలో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల పప్పు/సాంబారు, కూర 100 గ్రాములు, పెరుగు 75 గ్రాములు, చట్నీ 15 గ్రాములు అందజేస్తున్నారు.

అధికారికంగా ప్రారంభమైన క్యాంటీన్లు…: బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చిట్టివలసలో అన్న క్యాంటీన్‌ ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమ్స్‌ ఆసుపత్రికి సమీపంలోనూ, ఎంవీపీకాలనీలోనూ క్యాంటీన్లను ప్రారంభించారు. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మర్రిపాలెంలోనూ, ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో సెంటర్లలోను ప్రారంభించారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ టర్నర్‌ చౌల్ట్రీ, ఫ్రూట్‌ మార్కెట్‌ వద్ద క్యాంటీన్లలో భోజనం చేసి ప్రారంభించారు. చినగంట్యాడలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నమ్మిదొడ్డిలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి ఎన్టీఆర్‌ కూడలిలో ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ క్యాంటీన్లను ప్రారంభించారు. ములగాడ, శ్రీహరిపురం, వాంబే కాలనీలో ట్రయల్‌రన్‌గా బుధవారం క్యాంటీన్లను ప్రారంభించి, మధ్యాహ్నం నుంచి ఆహారాన్ని అందించారు. వాటిని 13న అధికారికంగా ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.