అనుమానం పెనుభూతమై
పిల్లల అపహరణ ముఠాలు సంచరిస్తున్నాయంటూ ప్రచారం
హోరెత్తిపోతున్న సామాజిక మాధ్యమాలు
నగరమంతటా కలకలం.. అపరిచితులపై దాడులు
జగదాంబకూడలిలో ఓ వ్యక్తి మృతి
కంచరపాలెంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
నగరవ్యాప్తంగా మరికొన్నిచోట్లా ఘటనలు
న్యూస్‌టుడే, జగదాంబకూడలి

పిల్లల అపహరణ ముఠాల పేరుతో వదంతులు
సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం
నగరవ్యాప్తంగా కలకలం
అనుమానితులపై దాడులు
పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతున్నారంటూ వదంతులు
అనుమానుతులపై దాడి
పోలీసుల అదుపులో ఆ వ్యక్తులు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : గోపాలపట్నం దరి జీవీఎంసీ 66వ వార్డు వెంకటాపురం పరిసరాల్లో ఆదివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ అపరిచిత వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తికి మతిస్థితిమితం లేకపోవడంతో స్టేషన్లోనే ఉంచారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నగరంలో తిరుగుతూ మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నారంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని పోలీసులు తెలిపారు. అయితే అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని ఆటోలో ప్రచారం నిర్వహించారు.
పీఎంపాలెం, న్యూస్‌టుడే: పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు వచ్చాడంటూ కాలనీ వాసులకు ఓ వ్యక్తిపై అనుమానం రావడంతో చితకబాదిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో జరిగిన ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హౌసింగ్‌బోర్డు కాలనీ స్టేడియం వెనుక ప్రాంతంలో ఓ వ్యక్తి శనివారం సాయంత్రం అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. గమనించిన కొందరు నివాసితులకు అతని తీరుపై అనుమానం కలిగింది. వివరాలు తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా అతను నోరు విప్పక పోవడంతో ఆగ్రహంతో చితకబాదారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు వచ్చి అతను దొంగ కాదు మతిస్థిమితం లేక రోజూ స్థానిక ప్రాంతాల్లో తిరుగుతాడని చెప్పడంతో సమస్య ముగిసింది.
చిట్టివలసలో అపరిచితుడి పట్టివేత
చిట్టివలస(తగరపువలస),న్యూస్‌టుడే: పిల్లల కిడ్నాపర్‌గా భావించి చిట్టివలసలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చిట్టివలస గణేశ్ థియేటరు వద్ద శనివారం ఒకర్ని పట్టుకున్నారు.
కంచరపాలెం పోలీసు స్టేషన్ ముట్టడి
తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : కంచరపాలెం ప్రాంతంలో చిన్న పిల్లలను అపహరిస్తున్న ముఠాను తమకు అప్పగించాలని కోరుతూ స్థానిక ప్రజలు ఆదివారం రాత్రి కంచరపాలెం పోలీసు స్టేషన్‌ను ముట్టడించడంతో ఇక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ప్రజల చేతిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను చికిత్స చేయించేందుకు ఆసుపత్రికి తరలించడానికి సైతం పోలీసులు తీవ్ర ప్రయాసపడాల్సి వచ్చింది. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారు తీవ్రంగా గాయపడి ఉన్నారని, తాము విచారించిన తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నా ఏ మాత్రం వినిపించుకోకుండా స్టేషన్‌ను దిగ్భందం చేశారు. వారిని 108లో ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. అంబులెన్స్ ముందు ఓ ఎస్కార్ట్ వాహనాన్ని సైతం అధికారులు ఏర్పాటు చేయటం విశేషం. ఆందోళనకారులు అంబులెన్స్ వెంట కొంత దూరం పరుగులు తీసి ఆ తర్వాత వదిలేసారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
వాళ్లు మాట్లాడే స్థితిలో లేరు
కంచరపాలెం ప్రాంతంలో ప్రజల చేతిలో గాయపడ్డ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాకీర్ మాలీ, మరో మహిళ ఉంది. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. వారి వద్ద రూ.1.47 లక్షలు నగదు లభించింది. దీనిపై విచారిస్తున్నాం. అలాగే వేపగుంటకు చెందిన మరో యువతి, ఓ మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి, ఇద్దరు అపరిచిత వ్యక్తులను కూడా స్థానికులు పట్టుకొని అప్పగించారు. వీరిలో కొందరు అమాయకులు ఉన్నారన్నారు.
– ఎల్.అర్జున్, వెస్ట్‌జోన్ ఏసీపీ.
ఆటోనగర్, న్యూస్‌టుడే: పిల్లల్ని ఎత్తుకు పోతున్నారని వదంతులు వ్యాపించడంతో ఆదివారం పాతగాజువాక నుంచి కణితిరోడ్డు కూడలిలో కొందరు ఒక మతిస్థిమితం లేని వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పెద్దఎత్తున పోగయిన జనాన్ని చెదరగొట్టి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అమాయకులపై దాడి చేయవద్దని ఎస్సై శ్రీధర్ స్థానికులకు అవగాహన కల్పించారు.
భయపడాల్సిన పనిలేదు….
నగరంలోకి దొంగలు, అపహరణ ముఠాలు రాలేదు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారమవుతున్నాయి. పాత చిత్రాలను పంపుతూ అవి తాజా సంఘటనలుగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అనుమానంతో అకారణంగా ఎవరిపైనా దాడులకు పాల్పడవద్దు. ఏదైనా స్పష్టమైన సమాచారం ఉంటే పోలీసులకు చెప్పండి.