News

Realestate News

అనుకూల స్థలం చూపిస్తే అనుమతి మంజూరు : జేసీ సృజన

అనుకూల స్థలం చూపిస్తే అనుమతి మంజూరు : జేసీ సృజన
రాచపల్లి (మాకవరపాలెం), న్యూస్‌టుడే: తాగునీటి పథకం నిర్మాణం కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చూపించిన స్థలంపై వివాదం కోర్టులో ఉందని ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేమని జేసీ సృజన స్పష్టం చేశారు. మాకవరపాలెం మండలంలో పలు గ్రామాల ప్రజలకు తాగునీరందించేందుకు ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ద్వారా రూ. 3.35 కోట్లు మంజూరయ్యాయి. ఈ పథకం నిర్మాణం చేసేందుకు రాచపల్లి శివారు కొత్తపాలెం నిర్వాసితుల కాలనీ వద్ద 50 సెంట్లు మంజూరు చేయాలని రెవెన్యూశాఖకు దరఖాస్తు చేశారు. స్థల పరిశీలన కోసం మంగళవారం సాయంత్రం జేసీ కొత్తపాలెం వచ్చారు. ఆన్‌రాక్‌ పరిశ్రమలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి రాచపల్లి శివారున ఏపీఐఐసీ 118 ఎకరాలు సేకరించి అప్పగించారు. అనంతరం నిర్వాసితులకు 33 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు అప్పగించారు. మిగిలిన 83 ఎకరాల భూమిని పరిశ్రమ యాజమాన్యం నుంచి ఇటీవల రెవెన్యూశాఖ తిరిగి తీసుకుంది. పరిశ్రమ యాజమాన్యం ఈ భూమికి డబ్బులు చెల్లించామని భూములు తమకు చెందుతాయంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఉన్న స్థలం ఉన్నట్లుగా ఉంచాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ భూమిలో 50 సెంట్లు ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కోరారని, కోర్టు ఆదేశాల మేరకు ఇవ్వడం కుదరదని వేరే స్థలం చూపిస్తే పరిశీలించి అనుమతి ఇస్తానని జేసీ తెలిపారు. నిర్వాసితులకు ఎంతమందికి 7, 5, 2 సెంట్లు చొప్పున స్థలాలు ఇచ్చారనే వివరాలు పూర్తిగా తమకు అందించాలని నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దారు రమణ, డీఈ రామస్వామి, ఏఈ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.