అనిశా వలలో సబ్బవరం వీఆర్వో
అనిశా వలలో సబ్బవరం వీఆర్వో
రూ. 25వేల లంచం తీసుకుంటూ చిక్కిన వెంకటస్వామి
సబ్బవరం, న్యూస్‌టుడే: అనిశా వలలో సబ్బవరం వీఆర్వో
వెంకటస్వామి.. ఇటీవల బదిలీపై సబ్బవరం మండలానికి వచ్చాడు.
సబ్బవరం-2, నంగినారపాడు, అజనగిరి గ్రామాలకు వీఆర్వోగా పని చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు.
అప్పుడే లంచావతారం ఎత్తాడు.
శుక్రవారం ఓ మహిళ నుంచి రూ.25వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ చెప్పిన వివరాలు
ఇలా ఉన్నాయి..
సబ్బవరం మండలం రెవెన్యూ పరిధిలోని అజనగిరి గ్రామానికి చెందిన విరోతి హరితకు తండ్రి నుంచి సంక్రమించిన 1.24 ఎకరాల భూమి ఉంది.
ఆమె భర్త రాము, మాజీ సైనికోద్యోగి.
తండ్రి నుంచి తనకు బహుమానంగా లభించిన భూమికి పట్టాదారు (ఈ) పాస్‌పుస్తకం ఇప్పించాలని,
ఆ భూమి వివరాలను రెవెన్యూ దస్త్రాలలో మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకొంది.
అధికారుల వద్ద పని కాకపోవడంతో వీఆర్వో వెంకటస్వామిని కలిసింది.
కొంతకాలం తిప్పించుకున్న తరువాత రూ.30వేలు ఇస్తే పని అవుతుందని చెప్పాడు.
చివరికి రూ.25వేలు ఇవ్వాలని స్పష్టం చేశాడు. హరిత ఈ విషయాన్ని భర్తకు చెప్పింది.
వారు అనిశా అధికారులకు ఆశ్రయించారు.
వారి సూచన మేరకు రూ.25వేలను శుక్రవారం తాలూకా కార్యాలయంలో ఇస్తానని హరిత వీఆర్వోకు చెప్పింది.
అయితే అక్కడ వద్దని, అజనగిరి రేషన్ దుకాణం వద్దకు రావాలని వీఆర్వో సూచించాడు. ఆమె ఈ విషయాలన్నీ అనిశా అధికారులకు చెప్పింది.
అనిశా డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ పౌడరు చల్లిన నోట్లను ఆమె చేతికి ఇచ్చారు.
వీఆర్వో ఆ మొత్తాన్ని తీసుకుని ఫ్యాంట్ కుడిచేతి పక్కనున్న బేబులో పెట్టుకున్నాడు.
వెంటనే అనిశా అధికారులు అతనిపై దాడి చేసి నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
నోట్లకు రసాయన పరీక్షలు నిర్వహించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.