News

Realestate News

అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులు షురూ!

అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులు షురూ!
భూసేకరణ అధికారిగా అనకాపల్లి ఆర్డీవో పద్మావతి
నేటి నుంచి సర్వే

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఇరుకు రహదారి.. ఎదురుగా వాహనం వస్తే గుండెల్లో భయాందోళన.. రాత్రివేళలో ప్రయాణం నరకప్రాయం.. ఇవీ అనకాపల్లి-అచ్యుతాపురం రహదారిలో ప్రయాణికులు తరచూ పడుతున్న ఇబ్బందులు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమల వల్ల పెరిగిన రద్దీతో ఈ రహదారికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. కంపెనీల బస్సులతోపాటుగా ఇతర వాహనాలను అధిక సంఖ్యలో రహదారిపై రాకపోకలు అధికంగా సాగించడంతో ఏర్పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా 120 అడుగుల మేర రహదారిని విస్తరించడానికి సన్నాహాలు ప్రారంభించారు. 13.78 కిలోమీటర్ల మేర చేపట్టనున్న విస్తరణ పనుల్లో భాగంగా మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెంలో 120 అడుగులు మిగిలిన ప్రాంతాల్లో 100 నుంచి 105 అడుగుల మేర విస్తరణ పనులు చేపట్టడానికి ఇప్పటికే ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వేరాళ్లను పాతారు. దీనికోసం రూ.214 కోట్ల 15లక్షల 77వేల 454 నగదు అవసరమని నివేదిక తయారుచేశారు. ఈ నిధులపైన, విస్తరణలో భాగంగా జరిగే నష్టపరిహారాన్ని సమగ్రంగా సర్వే జరపాలని జిల్లాకలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రెవిన్యూ అధికారులను ఆదేశాలు జారీచేశారు. దీంతోపాటుగా భూసేకరణ అధికారిణిగా అనకాపల్లి ఆర్డీవో బి.పద్మావతిని నియమించారు. ఈమె ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌లు జె.మురళీకృష్ణ, పి.భార్గవితో పాటుగా అచ్యుతాపురం, మునగపాక తహసీల్దార్‌లు బి.రవికుమార్‌, జి.రాంబాబులతో సమావేశాన్ని నిర్వహించారు. విస్తరణ పనులపై విస్తృతంగా చర్చించారు.

నేటి నుంచి ఎంజాయ్‌మెంట్‌ సర్వే పనులు
విస్తరణ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ అధికారులకు ఇచ్చిన మార్కింగ్‌లో ఎంజాయ్‌మెంట్‌ సర్వేను రెవిన్యూ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం ఏడుగురు సర్వేయర్‌లను నియమించారు. వీరు శుక్రవారం నుంచి పనులు ప్రారంభిస్తారు. పసుపు రంగులో వేసిన సర్వేరాళ్ల ప్రాంతాన్ని పరిశీలన జరిపి దీంట్లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది.. ఎంత ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి, భవనాలను వివరాలను తయారుచేస్తారు. దీని ప్రకారం ఎవరికెంత నష్టపరిహారం అందించాలన్న దానిపై ఒక స్పష్టత వస్తుంది. ఈ నివేదికను తయారుచేస్తే నిధులను ఏడీబీ (ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు) నుంచి రుణం కింద ప్రభుత్వం తీసుకుని పనులు ప్రారంభిస్తుంది. విస్తరణ పనులకు సంబంధించి రెవిన్యూ అధికారులకు బాధ్యతను అప్పగించడంతో ఈ పనులకు శ్రీకారం చుట్టినట్లయ్యింది.

రెండు మండలాల గ్రామాల్లో..
అనకాపల్లి-అచ్యుతాపురంలో నిర్వహించనున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లి పట్టణంలో కొంత భాగంతో పాటుగా మునగపాక మండలంలో మునగపాక, తిమ్మరాజుపేట, తోటాడ, నాగులాపల్లి, జె.పి అగ్రహారం గ్రామాలతో పాటుగా అచ్యుతాపురం మండలంలోని చోడపల్లి, తిమ్మరాజుపేట, హరిపాలెం, కొండకర్ల గ్రామాల్లోని రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ పనుల్లో భాగంగా అచ్యుతాపురం కూడలి వద్ద కిలోమీటరున్నర పరిధిలో పైవంతెన పనులకు ప్రతిపాదనలు తయారుచేశారు. ముఖ్యప్రాంతాల్లో 120 అడుగుల మేర చేపట్టి మిగిలిన ప్రాంతాల్లో 100 నుంచి 105 అడుగుల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పనుల కోసం రెవిన్యూ అధికారులు ఎంజాయ్‌మెంట్‌ సర్వేని ప్రారంభించి నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు.

పూర్తివివరాలతో నివేదిక
అనకాపల్లి-అచ్యుతాపురం రహదారికి ఆర్‌అండ్‌బీ అధికారులు వేసిన మార్కింగ్‌ సర్వేరాళ్లపై రెవిన్యూపరంగా ఎంజాయ్‌మెంట్‌ సర్వేను ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 80 అడుగుల రహదారిని 100 నుంచి 120 అడుగుల వరకు విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై పూర్తిగా సర్వేజరిపి ఎంతమేర నష్టపరిహారం అందించాల్సి ఉంటుంది.. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి.. అన్నదానిపై వివరాలు తయారుచేస్తాం. ఆర్‌అండ్‌బీ అధికారులు వేసిన అంచనా వ్యయం, ఇక్కడి పరిస్థితిపై రెవిన్యూపరంగా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపాలని జిల్లాకలెక్టర్‌ ఆదేశించారు. భూసేకరణ అధికారిగా రెవిన్యూ సిబ్బందితో సమగ్రంగా సర్వే నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుని పనులు వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. – బి.పద్మావతి, అనకాపల్లి ఆర్డీవో