అనకాపల్లికి మరో పైవంతెన!
రూ. 38కోట్లతో నిర్మాణం

2009లో పనులకు శంకుస్థాపన
ఈ పైవంతెన పనులకు 2009లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు ప్రారంభించడంలో అవరోధాలు ఏర్పడ్డాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ పనులు ఎలాగైనా పూర్తిచేయాలన్న లక్ష్యంతో రీ సర్వే జరిపారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 1.5 కిలోమీటర్ల మేర చేపట్టనున్న పైవంతెన పనుల్లో భాగంగా భీమునిగుమ్మంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి పనులు ప్రారంభించి గుండాల కూడలి వద్ద ముగించాలని మ్యాప్ తయారుచేశారు. ఈ పనుల్లో భాగంగా 47 భవన యజమానులకు నష్టపరిహారం అందించాల్సి ఉంది. కోల్పోయిన భవనాలతో పాటుగా భూమికి ధరను చెల్లించేందుకు రూ.21కోట్ల నష్టపరిహారం నిధులు కావాలని ప్రతిపాదనలు తయారుచేశారు. వంతెన నిర్మాణ పనుల కోసం రూ.38కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసినట్లు ఆర్అండ్బీ డీఈ బి.శ్రీనివాసరావు తెలిపారు.
రెవెన్యూ ఆధ్వర్యంలో ఎంజాయ్మెంట్ సర్వే
ప్రస్తుతం ఆర్అండ్బీ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపేటపై వంతెన పనులకు సర్వే జరిపారు. దీనికోసం తయారుచేసిన ప్రతిపాదనలపై రెవెన్యూ అధికారులతో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించనున్నారు. భూసేకరణ అధికారిణిగా అనకాపల్లి ఆర్డీవో బి.పద్మావతిని నియమించడంతో ఆమె ఆధ్వర్యంలో ఎంజాయ్మెంట్ సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. వంతెన పనుల్లో భవనాలు ఎంత మేర పోతున్నాయి. భూమి కోల్పోయిన వారికి మార్కెట్ ధర ప్రకారం చెల్లించాల్సిన నష్టపరిహారంపై సమగ్రంగా సర్వే జరిపేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
ప్రభుత్వానికి నివేదిక
లక్ష్మీదేవిపేట పైవంతెన పనులు వీలైనంత త్వరగా చేపట్టేందుకు ఎంజాయ్మెంట్ సర్వేను వెంటనే చేపడతాం. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపితే నష్టపరిహారం నిధులు మంజూరవుతాయి. వీటిని లబ్ధిదారులకు అందించి వంతెన పనులకు టెండర్లు పిలుస్తారు. రెవెన్యూపరంగా వంతెన పనులు వెంటనే చేపట్టేందుకు చేపట్టాల్సిన పనులను వేగవంతంగా పూర్తిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇక్కడ వాహనరద్దీ ఎక్కువగా ఉండటంతో పైవంతెన పనులు త్వరితగతిన పూర్తిచేసేలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దీనికోసం రెవెన్యూపరంగా చేపట్టాల్సిన పనులు వెంటనే పూర్తిచేస్తాం. – బి.పద్మావతి, అనకాపల్లి ఆర్డీవో