News

Realestate News

అత్యాధునిక అంబులెన్సు వచ్చేసింది!

అత్యాధునిక అంబులెన్సు వచ్చేసింది!
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌ నర్సీపట్నం ప్రాంతీయాస్పత్రికి కేటాయించారు. దాదాపు రూ.32 లక్షలు విలువైన ఈ అంబులెన్స్‌కు గుండె వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడే పరికరాలతో పాటు కృత్రిమశ్వాస పరికరాలు వంటివి ఉన్నాయి. విశాఖ జిల్లాకు తొమ్మిది అంబులెన్స్‌లు కేటాయించగా తొలివిడతలో రెండు వచ్చాయి. విశాఖ నగరానికి ఒకటి, గ్రామీణ జిల్లాకు ఉపయోగపడేలా నర్సీపట్నానికి ఒకటి కేటాయించారు. 108 సర్వీసుల ప్రాంతీయ మేనేజరు హేమంత్‌కుమార్‌ బట్టూ మంగళవారం ఇక్కడకు వచ్చి ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ సుధాశారదకు వాహనాన్ని అప్పగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలకోసం దీన్ని వినియోగించాల్సివున్నందున ఎన్నికల కోడ్‌తో సంబంధం లేకుండా దీన్ని తక్షణం వినియోగంలోకి తీసుకువస్తున్నామని వివరించారు. రాష్ట్రానికి 76 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు వాహనాలు ఫిబ్రవరి 23న వచ్చాయన్నారు. 108అంబులెన్సులన్నీ కొత్తవి వినియోగంలో ఉన్నాయన్నారు. గొలుగొండ మినహా జిల్లాలో అన్నీ కొత్తవే అన్నారు. ఫిబ్రవరిలో 108 అంబులెన్స్‌ల్లో 52,284మందికి సేవలు అందించగా వాటిలో 21,113 మంది గర్భిణులు ఉన్నారన్నారు. విశాఖ జిల్లాపరంగా చూస్తే 4,998మందికి సేవలు అందిచగా వీరిలో 58 మంది గర్భిణులు ఉన్నారన్నారు. 108 అంబులెన్స్‌ల్లోనే ప్రసవాలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. నిపుణులైన మహిళా ఉద్యోగులను 108ల్లో నియమించామని తెలిపారు.