News

Realestate News

అతిథిదేవోభవ!

vizag real estate news

అతిథిదేవోభవ!
అభివృద్ధి దిశగా ఆతిథ్య రంగం
మరో రూ. 350 కోట్ల పెట్టుబడులు
ఇప్పటికే రూ. 250 కోట్లతో ప్రాజెక్టులు
ఈనాడు, విశాఖపట్నం
హా నగరంలో ఆతిథ్య రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే రూ. 250 కోట్లకుపైగాప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, రాబోయే రెండేళ్లలో మరో రూ. 350 కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాల అంచనా.పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధిలో నగరం ముందు వరుసలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల సంఖ్య గడిచిన ఏడాదిన్నరలో 38 శాతం పెరిగింది. ఇటీవల కాలంలో ఏడాదికి విదేశీ ప్రతినిధులు సుమారుగా 12 వేల మంది వరకు వస్తున్నారు. ఏడాదిన్నరలోనే వీరి శాతం వందశాతానికిపైగా పెరిగింది. వీరంతా నక్షత్రాల హోటళ్లలోనే బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగ్‌లు కూడా పెరిగాయి. సమీప భవిష్యత్తులోనూ సదస్సులు, షూటింగ్‌లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా హోటళ్లు, బీచ్‌ రిసార్ట్స్‌లు, రిసార్ట్స్‌లు, రెస్టారెంట్‌లు, కన్వెన్షన్‌ సెంటర్లకు ఆదరణ పెరగడంతో అనేక సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

నగర పరిధిలో చిన్నా, పెద్దా కలుపుకొని దాదాపు 175 హోటళ్లున్నాయి. వీటిలో నక్షత్రాల హోటళ్లు 10, ఫలహారశాల సదుపాయం ఉన్న హోటళ్లు ఇంకో 25,, లాడ్జీలు 140 ఉన్నాయి. మొత్తం 900 గదులు అందుబాటులో ఉన్నాయి. తరచూ అంతర్జాతీయస్థాయి సదస్సులు, సమావేశాలకు నగరం వేదికగా నిలవడంతో గదులకు గిరాకీ ఏర్పడుతోంది. ప్రస్తుతం 60 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గడచిన రెండేళ్లలో 10 నుంచి 15 శాతం పెరిగింది. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన సమయంలో నగర హోటళ్లలో గదుల కొరత ఏర్పడింది.

పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. దేశీయంగా ఏటా 70 లక్షల మంది వరకు నగరాన్ని సందర్శిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. హెలీ టూరిజాన్ని ఈ దసరాకు ప్రారంభించనున్నారు. గోవా తరహాలో విశాఖ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా అనేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో తీరాన్ని ఆనుకుని ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు గిరాకీ ఏర్పడుతోంది. ప్రత్యేకించి పశ్చిమబంగ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎక్కువగా నగరాన్ని సందర్శిస్తున్నారు. గడచిన ఆరు నెలల వ్యవధిలో అన్ని సదుపాయాలు కలిగిన నాలుగు కొత్త హోటళ్లు అందుబాటులోకొచ్చాయి. మరో ఐదు నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పీపీపీ ప్రాజెక్టులపైనా ప్రభుత్వ దృష్టి…
నగర పరిధిలో పర్యాటక, ఆతిథ్య రంగంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో పది మెగా ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు ఉండగా, వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదు. వీటిపై ఇప్పుడు దృష్టిపెట్టిన యంత్రాంగం వీటిని గాడిలో పెట్టేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల దాదాపు రూ 1.000 కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశాలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉపాధి కలగనున్నది. ఇందుకోసం భూములను సిద్ధం చేసి వివిధ సంస్థల ప్రతినిధులతో త్వరలో విశాఖలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

వ్యాపారం ఆశాజనకంగా ఉంది…
విశాఖ నగరంలో ఆతిథ్యరంగ వ్యాపారం ఆశాజనకంగా ఉంది. సందర్శకుల సంఖ్య పెరగడంతో హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు 40 నుంచి 60 శాతానికి పెరిగింది. రెస్టారెంట్లకు వచ్చే వారూ పెరిగారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. దీన్ని స్వాగతించాల్సిందే. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లోనూ ఆతిథ్య రంగంలో మరిన్ని మార్పులు రాబోతున్నాయి. కచ్చితమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

– డాక్టర్‌ ఎస్‌.ఎ.రెహ్మాన్‌, జిల్లా హోటళ్ల నిర్వాహకుల అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు