News

Realestate News

అట్టహాసంగా.. జాతీయ ఎలైటు బాక్సింగ్‌ పోటీలు ప్రారంభం

అట్టహాసంగా.. జాతీయ ఎలైటు బాక్సింగ్‌ పోటీలు ప్రారంభం
విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: రెండో జాతీయ ఎలైటు బాక్సింగ్‌ పోటీలు మంగళవారం రాత్రి నగరంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను రైల్వే క్రీడా ప్రమోషన్‌ బోర్డు స్టాప్‌ సభ్యుడు డి.కె.గయాన్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. రైల్వే క్రీడాకారులు ఒలింపిక్స్‌ వంటి మెగా పోటీల్లో పాల్గొంటూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. విశాఖలో జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డీఆర్‌ఎం ఎం.ఎస్‌.మాథూర్‌ మాట్లాడుతూ నగరంలో జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీల నిర్వహణకు నెల రోజులపాటు శ్రమించామన్నారు. జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ సహాయసహకారాలు అందించడం అభినందనీమన్నారు. రైల్వే క్రీడా ప్రమోషన్‌ బోర్డు కార్యదర్శి రేఖా యాదవ్‌ మాట్లాడుతూ నిర్వహణ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రైల్వేలో 3వేల మంది క్రీడాకారులుండగా, 35 మంది గత ఏడాది రియో ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహించారన్నారు. భారత బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌సింగ్‌ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో మూడు ప్రపంచస్థాయి బాక్సింగ్‌ పోటీలు జరగనున్నాయన్నారు. పురుషుల విభాగంలో జరుగుతున్న ఈ టోర్నీల్లో దేశం నలుమూలల నుంచి 300 మంది బాక్సర్లు పది విభాగాల్లో తలపడతారని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌, జీవీఎంసీ కమిషనరు హరినారాయణన్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా శివథాప, మనోజ్‌కుమార్‌
టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా శివథాప, మనోజ్‌కుమార్‌ నిలుస్తున్నారు. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత శివథాప, కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ పోటీల్లో స్వర్ణ పతక విజేత మనోజ్‌కుమార్‌ల మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించనుంది. వీరితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ టోర్నీలో పంచ్‌లు విసిరేందుకు సై అంటున్నారు.

తొలి రోజు ఫలితాలు ఇలా..
వీర్‌సింగ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌) 5-0తో ప్రవీణ్‌(పాండిచ్చేరి)పై, అజయ్‌ తెరాన్‌(అసోం) 4-1తో రామ్‌సహాని(పశ్చిమబంగ)పై, మంజిత్‌కుమార్‌ సాహా(పశ్చిమబంగ) 4-1తో జి.వి.యశ్వంత్‌(తమిళనాడు)పై, రామ్‌సింగ్‌పాల్‌( ఉత్తరప్రదేశ్‌) 4-1తో లోకేష్‌సాహు (చత్తీస్‌గఢ్‌)పై విజయం సాధించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo