అటవీ అనుమతుల కోసం ప్రత్యేక అధికారి
అటవీ అనుమతుల కోసం ప్రత్యేక అధికారి
పీఆర్ అధికారులకు కలెక్టర్ ఆదేశం
గ్రామీణ విశాఖ, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న రహదారుల నిర్మాణానికి అవసరమైన అనుమతులు అటవీశాఖ నుంచి తీసుకోవడానికి డీఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని కలెక్టర్ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టర్ పంచాయతీరాజ్, పోలీసు, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో 27 రహదారుల నిర్మాణం చేపట్టవల్సి ఉందని, దీని కోసం అటవీశాఖ భూములను తీసుకోవల్సి ఉందన్నారు. భూ సేకరణతో సహా ఇతరత్రా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రహదారుల నిర్మాణం చేపడతామని, అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా ఇవ్వవల్సిన భూములను రెవెన్యూ అధికారులు గుర్తిస్తారని చెప్పారు. తాను అటవీశాఖ ముఖ్యకార్యదర్శితో మాట్లాడనున్నట్లు చెప్పారు. 12 రహదారులకు ఇంకా సర్వే పూర్తి చేయవల్సి ఉందని, ఏడు రహదారుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నామని పంచాయతీరాజ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు గజేంద్ర, నర్సింహారావు, రాజు, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజుల్లో శిక్షణ పూర్తి చేయాలి
అన్ని ప్రభుత్వ శాఖలు ఈ-కార్యాలయాలుగా మారాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యాలయాల ప్రగతిపై సంయుక్త కలెక్టర్ సృజనతో కలిసి ఆయన శనివారం రాత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ-కార్యాలయాల నిర్వహణపై అన్ని శాఖల సిబ్బందికి శిక్షణ నాలుగురోజుల్లో పూర్తి చేయాలని, ప్రతివారం జేసీ సృజన వీటి ప్రగతిపై సమీక్షిస్తారన్నారు. నిక్నెట్ సెంటర్లో అవసరమైన సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. నిక్నెట్ కేంద్ర అధికారి వై.వి.కె.ఎస్.ఆర్.మూర్తి, జేసీ-2 డి.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.