News

Realestate News

అగ్రపథాన విశాఖ

vizag real estate news

అగ్రపథాన విశాఖ
జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
ప్రగతి చిత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌
విశాఖపట్నం, ఈనాడు: ప్రగతిలో విశాఖపట్నం జిల్లా అగ్రపథంలో నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. విజయవాడలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమావేశం రెండోరోజైన గురువారం విశాఖ జిల్లా ప్రగతిపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా సాధించిన ప్రగతి, భవిష్యత్తు లక్ష్యాలను సీఎంకు వివరించారు. రెండంకెల వృద్ధి రేటులో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న విశాఖ జిల్లాను ఈ ఏడాది మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా సమర్థ కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నామని అన్నారు. గతేడాది పారిశ్రామిక రంగంలో 37.67 శాతం, సేవా రంగంలో 50.04 శాతం వృద్ధి సాదిస్తే.. ప్రాథమిక రంగంలో మాత్రం కేవలం 12.29 శాతం మాత్రమే వృద్ధి సాధించగలిగామని అన్నారు. ప్రాథమిక రంగంలో ఈ ఏడాది 23.20 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే తొలి త్రైమాసిక లక్ష్యాలు శతశాతం సాధించామన్నారు. పారిశ్రామిక రంగంలో 15.67 శాతం, సేవారంగంలో 11.13 శాతం సాధనకు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రికి వివరించారు.

రూ. 9,783.44 కోట్లతో పరిశ్రమలు..
పారిశ్రామిక రంగంలో లక్ష్య సాధనకు జిల్లాలో ఈ ఏడాది రూ. 315.44 కోట్ల పెట్టుబడితో 264 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు.. రూ.39,468 కోట్లతో 51 భారీ, మెగా పరిశమ్రల ఏర్పాటు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కొన్ని ప్రగతి దశలో ఉన్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా 65 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. స్టీల్‌ప్లాంటు, హెచ్‌పీసీఎల్‌ విస్తరణతోపాటు అచ్యుతాపురం, పాయకరావుపేట, అగనంపూడి, అప్పికొండ తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటులో ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి కలెక్టర్‌ తీసుకెళ్లారు.

రూ.34.85 కోట్లతో పర్యాటక ప్రగతి..
గతేడాది పర్యాటక అభివృద్ధి సంస్థ, వుడా, ఐటీడీఏల ఆధ్వర్యంలో రూ. 34.85 కోట్లతో 19 ప్రాజెక్టులకు చర్యలు చేపడితే.. వీటిలో 17 ఇప్పటికే పూర్తయ్యాయని కలెక్టర్‌ పేర్కొన్నారు ఈ ఏడాది రూ.3.35 కోట్లతో 17 ప్రాజెక్టులు మంజూరయ్యాయన్నారు. ప్రాధాన్య కమ్రంలో వీటన్నింటినీ పూర్తిచేస్తామన్నారు. రూ.15.25 కోట్ల అంచనాతో బీచ్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టామని.. ఇందులో భాగంగా రూ. 2.50 కోట్లతో తొట్లకొండ బీచ్‌ అభివృద్ధి పనులు పూర్తిచేశామన్నారు. సాగర్‌నగర్‌, ఎండాడ, మంగమూరిపేట, రుషికొండ, భీమునిపట్నం, రేవుపోలవరం, యారాడ బీచ్‌ అభివృద్ధి పనులు ప్రగతిలో ఉన్నట్లు వివరించారు.

త్వరితగతిన గృహనిర్మాణ లక్ష్యాలు..
బడుగు, బలహీన వర్గాల వారికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో జిల్లాలో రూ.1005.92 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 70,254 గృహ నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. ప్రైవేటు పరంగా గృహనిర్మాణ రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో గత మూడేళ్లకాలంలో జిల్లాలో రూ.6,812.63 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించడమైనదని తెలిపారు.

2020 నాటికి పనులు పూర్తి..
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.2,220 కోట్ల అంచనాతో మంజూరుచేసిన ఏపీ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు పనులు ప్రగతిలో ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 2020 సెప్టెంబర్‌ నాటికి ఈ పనులు పూర్తిచెయ్యాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో నుంచి కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షను జిల్లా కీలక అధికారులు వీక్షించారు. జేసీ-2 డి.వెంటకరెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రామశాస్త్రి, డీఎంహెచ్‌వో సరోజిని, వ్యవసాయ శాఖ జేడీ వెదురుపాక సత్యనారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం రామలింగేశ్వరరావు, గృహనిర్మాణ సంస్థ పీడీ ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo