News

Realestate News

అందుబాటులో..వృద్ధిబాటలో

అందుబాటులో..వృద్ధిబాటలో
ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి మార్కెట్‌లో క్రమంగా క్రయవిక్రయాలు పెరుగుతున్నాయి. పెద్ద నోట్ల ఉపసంహరణ అనంతరం కొన్నాళ్లపాటు స్తబ్దుగా మారిన స్థలాల లావాదేవీలు వూపందుకుంటున్నాయి. ఎక్కువగా శివార్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టేముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు.

విల్లాలు, వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, స్థలాలు ఏదైనా వారి బడ్జెట్‌లో కొనుగోలు చేసే అవకాశం శివారు ప్రాంతాల్లోనే సాధ్యం. కొంతమంది సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు పెట్టుబడి దృష్ట్యా కొంటుంటారు. వ్యక్తిగత ఆర్థిక స్తోమతను బట్టి అందుబాటు ధరల్లో, విలాస వంతమైన, బడ్జెట్‌ శ్రేణిలో ఎంపిక చేసుకుంటుంటారు. అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనైతే స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి.

కొంతకాలం పట్టొచ్చు…
పెట్టుబడి దృష్ట్యా కొనుగోలు చేసేవారు తొందరగా మంచి ధర వస్తే విక్రయించే ఆలోచనలో ఉంటుంటారు. మౌలిక వసతుల అభివృద్ధిలో జరిగే జాప్యం, ఇతరత్రా కారణాలతో అనుకున్నంత వేగంగా ఆ ప్రాంతం వృద్ధి చెందకపోవచ్చు. రహదారులు వేయడంలో ఆటంకాలు, ప్రకటించిన ప్రాజెక్ట్‌ వెనక్కిపోవడం వంటివి జరుగుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదట కొన్నేళ్లపాటూ మన మూలధన విలువ ఏ మాత్రం పెరగదు. పెద్ద నోట్ల ఉపసంహరణ వంటివి వస్తే తగ్గనూ తగ్గవచ్చు. ఇటువంటి చోట్ల కొనేటప్పుడు వీటికి సిద్ధపడాల్సి ఉంటుందని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. అప్పు చేసి పెట్టుబడి దృష్ట్యా కొనేటప్పుడు ఒకింత జాగ్రత్తగా ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఉపాధికి చేరువలో…
కొనుగోలు చేసిన స్థిరాస్తికి ఆశించిన మేర విలువ పెరగాలంటే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం మేలు. ఐటీ, ఫార్మా, ఏరో, రవాణా హబ్‌కు చేరువలో కొనుగోలు చేయవచ్చు. ఇటువంటి చోట్ల ఎక్కువ మంది నివాసం ఉండటానికి మొగ్గు చూపిస్తుంటారు కాబట్టి వృద్ధికి అవకాశం ఉంటుంది. ఆరంభంలో కొనుగోలు చేస్తే ఎక్కువ లబ్ధి పొందవచ్చు.

అనుమతి ఉన్న వాటిలోనే…
ప్రస్తుతం శివార్లలో అనధికార లేఅవుట్లలో ఎక్కువగా విక్రయాలు సాగుతున్నాయి. అనుమతి పొందిన లేఅవుట్ల కంటే వీటిలో చౌకగా వస్తుండటంతో అమాయకులు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో అనుమతి లేకుండా వేసిన చాలా వెంచర్లను హెచ్‌ఎండీఏ ఇటీవల చాలా ప్రాంతాల్లో కూల్చేసింది. అయినా గ్రామ పంచాయతీ లేఅవుట్‌ అంటూ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. పంచాయతీలకు లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం లేదని హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్థలాలే కాదు శివార్లలో ఇటీవల అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. మూడు వందల గజాల్లో నాలుగంతస్తులు వేసి ఎల్‌ఆర్‌ఎస్‌ ఉందని విక్రయిస్తున్నారు. జి+2కు మించి నిర్మించే భవనాలకు హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి. ఒకవేళ ఇప్పటికే కట్టి ఉంటే బీఆర్‌ఎస్‌ ఉంటేనే అది చట్టబద్ధం. తక్కువ ధరకే వస్తుంది కదా అని తొందర పడకండని నిపుణులు సూచిస్తున్నారు.

ఏమీలేని చోట్ల..
శివార్లలో చాలా వెంచర్లు దశాబ్దాల క్రితం వేసినవి వేసినట్లే కొన్ని ప్రాంతాల్లో వెక్కిరిస్తుంటాయి. ఇక్కడ అప్పటితో పోలిస్తే ధరలు పెరిగినా.. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారు తక్కువ ప్రయోజనం పొందినట్లే. నివాస ప్రాంతాలకు చేరువలో.. ఆయా ప్రాంతం విస్తరణకు అవకాశం ఉన్న వాటిలో వృద్ధికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

అయితే…
శివారు ప్రాంతాలను నివాసానికి ఎంపిక చేసుకునేవారు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని గుర్తెరగాలి.
* అభివృద్ధి అయ్యే క్రమంలో ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణాల దుమ్ము ధూళి ఇబ్బంది పెడుతుంది.
* పూర్తి స్థాయిలో రహదారులు అందుబాటులో ఉండవు. రవాణా పరంగా కొన్నాళ్లు సమస్యలు తప్పవు. కొలువుకు చేరుకునేందుకు ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది.
* సరైన విద్యాసంస్థలు అందుబాటులో ఉండకపోవచ్చు. వైద్య సౌకర్యమూ ముఖ్యమే. వీటిని కూడా చూసుకోవాలి.