News

Realestate News

అందాలున్నాయ్‌.. ఆస్వాదించేదెలా!

అందాలున్నాయ్‌.. ఆస్వాదించేదెలా!
జలపాతాల వద్ద కనీస వసతుల కరవు
పర్యటకులకు తప్పని తిప్పలు
అనంతగిరి, న్యూస్‌టుడే
దేశ విదేశాల నుంచి వచ్చే పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న అనంతగిరి మండల పరిధిలో ఉన్న ప్రముఖ పర్యటక కేంద్రాలైన కటికి, తాటిగుడ జలపాతాల వద్ద సరైన సౌకర్యాలు లేక పర్యటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి ద్వారా పర్యటక శాఖకు ఎటువంటి ఆదాయం లేదన్న సాకుతో సంబంధిత అధికారులు జలపాతాలను అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేయడం లేదు. దీంతో పర్యటకులకు అవస్థలు తప్పటం లేదు.

తాటిగుడ.. తప్పని సాహసం
మండల కేంద్రమైన అనంతగిరికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిగుడ జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ జలపాతం వద్దకు వెళ్లే మార్గం అంత సక్రమంగానే ఉన్నా, పూర్తిగా జలపాతం వద్దకు వెళ్లి వాటి అందాలను ఆస్వాదించేందుకు మాత్రం పర్యటకులు కొంత సాహసం చేయాల్సి ఉంటుంది. జలపాతం కిందకు వెళ్లేందుకు చిన్న కొండను దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో చిన్నపాటి గులకరాళ్లు వంటివి ఉండటంతో ఈ మార్గం గుండా కిందకు దిగే పర్యటకులు జారిపడి ఎప్పటికప్పుడు గాయాలపాలతున్నారు. ఇక వృద్ధులైతే జలపాతాన్ని దూరం నుంచి చూడటం తప్ప దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. ఈ మార్గంలో కిందకు దిగేందుకు వీలుగా మెట్లను ఏర్పాటు చేస్తే ప్రతీ ఒక్కరికి సౌకర్యవంతంగా ఉంటుందని పలుమార్లు స్థానికులు పర్యటక శాఖకు తెలియజేశారు. అయినా ఏ ఒక్కరు పట్టించుకోవటం లేదు. దీంతో పర్యటకులకు అవస్థలు తప్పటం లేదు.

కటికి వెళ్లటం అతి కష్టం
అదేవిధంగా ప్రముఖ పర్యటక కేంద్రమైన బొర్రాగుహలకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కటికి జలపాతాన్ని వీక్షించేందుకు వెళ్లటం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనే అని చెప్పాలి. జలపాతానికి వెళ్లే మార్గమంతా పూర్తిగా అధ్వానంగా ఉంటుంది. రోడ్లపై పెద్దపెద్ద రాళ్లు తేలి ప్రయాణం అత్యంత కష్టతరంగా ఉంటుంది. జీపులు మినహాయించి మరే ఇతర వాహనాలు ప్రయాణించకపోవటంతో తప్పని పరిస్థితిలో అధిక మొత్తంలో చెల్లించి పర్యటకులు జీపుల ద్వారానే జలపాతానికి చేరుకోవాలి. తీరా జలపాతం ఉన్న గ్రామం వరకు వాహనాలు వెళ్లినా, అక్కడి నుంచి జలపాతానికి చేరుకునేందుకు సుమారు కిలోమీటరుకు పైగా నడవాల్సిన పరిస్థితి. ఈ మార్గంలో ఎటువంటి మెట్లు లేకపోవటంతో పర్యటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండపైకి ఎక్కి జలపాతాన్ని వీక్షించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

అభివృద్ధిపై దృష్టిసారించని పర్యటక శాఖ
అనంతగిరి మండలంలో బొర్రాగుహల తరువాత అంతటి ప్రాచుర్యం పొందినవి ఈ జలపాతాలు. నిత్యం వేలాది మంది వీటి అందాలను తిలకించేందుకు వస్తుంటారు. అయితే వీటి ద్వారా పర్యటక శాఖకు మాత్రం ఎటువంటి ఆదాయం ఉండదు. దీంతో జలపాతాలను అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ అధికారులు ముందుకు రావటం లేదు. కేవలం ఆదాయం వస్తున్న బొర్రాగుహల వంటి వాటిని మినహా, పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఇటువంటి ప్రకృతి అందాలను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించటం లేదని పర్యటకులు చెబుతున్నారు. ఆ శాఖ నిర్లక్ష్యం ఫలితంగా తాము అనేక అవస్థలు పడుతున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా పర్యటక శాఖ స్పందించి జలపాతాలకు చేరుకునేందుకు, అక్కడ సేదతీరేందుకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

వల్సంపేట జలపాతానికి అదనపు హంగులు
కొయ్యూరు, న్యూస్‌టుడే: మండలంలోని వల్సంపేట (గాదిగుమ్మి) జలపాతాన్ని సందర్శించే పర్యటకులకు ఎట్టకేలకు ఇబ్బందులు తొలగాయి. ఓ వైపు ఎత్తయిన కొండలు, మరోవైపు పంట భూముల నడుమ జాలువారే వల్సంపేట జలపాతం చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. పక్షుల కిలకిలల నేపథ్యంలో జలపాతాన్ని చూడటానికి మన్యంతోపాటు మైదాన ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లా నుంచి పర్యటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడకు వచ్చే సందర్శకులు కూర్చొని భోజనం చేయడానికి చాలా ఇబ్బందులు పడేవారు. పర్యటకులు సమస్యలపై దృష్టిసారించిన ప్రభుత్వం రూ.8.40 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పర్యటక శాఖ ఆధ్వర్యంలో జలపాతం పక్కనే మూడు హట్‌లు, ఓ షెడ్డు నిర్మించారు. వర్షం వచ్చినా, బాగా ఎండ కాసినా ఇబ్బంది లేకుండా వీటిల్లో ఉండి జలపాతాన్ని, ప్రకృతి అందాలను తిలకించొచ్చు. ఇక్కడ రోప్‌వే కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల కాలంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటించటం తెలిసిందే. రోప్‌వే ఏర్పాటైతే ఈ ప్రాంతం పర్యటకంగా మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Source : http://www.eenadu.net/