News

Realestate News

అందమైన విశాఖ… అభివృద్ధి వేదిక

development of smart city vizag

అందమైన విశాఖ… అభివృద్ధి వేదిక
ఇక్కడి విధానాలపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి
వివిధ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ
ఈనాడు – విశాఖపట్నం
ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరాల్లో విశాఖ ఒకటి. ఇక్కడి అభివృద్ధి చోదకాలపై బ్రిక్స్‌కు చెందిన బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అనేక అంశాల్లో అత్యుత్తమ విధానాలను పరిశీలించేందుకు వారు ప్రాధాన్యమిచ్చారు. నగర వీధుల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాలు, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన వుడా సెంట్రల్‌ పార్కును గురువారం రాత్రి ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆర్కే బీచ్‌ మొదలుకొని తీరం వెంబడి అందమైన పలు ప్రాంతాలను తిలకించారు.

2014 అక్టోబరు 12న హుద్‌హుద్‌ తీవ్ర పెనుతుపాను విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఇది అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. కొద్ది నెలల వ్యవధిలోనే మళ్లీ ఈ మహా నగరం పూర్వ వైభవాన్ని ఎలా సంతరించుకుందో విదేశీ ప్రతినిధులు ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రత్యేకించి విశాఖ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యక్రమాలపై జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ గురువారం దృశ్య, శ్రవణ నివేదిక ప్రదర్శించినపుడు ఎక్కువమంది ప్రతినిధులు సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశారు. అన్ని వీధుల్లోనూ ఎల్‌ఈడీ దీపాలు ఉపయోగించడంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన జీవీఎంసీపై దక్షిణాఫ్రికా ప్రతినిధులు దృష్టి సారించారు. విశాఖ వీధుల్లో ఎల్‌ఈడీ దీపాల వినియోగిస్తున్న తీరును పరిశీలించేందుకు వారు కమిషనర్‌తో చర్చించారు. హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి అనతికాలంలో ఏవిధంగా బయటపడగలిగారు? ఇందుకోసం తీసుకున్న చర్యలు, ప్రజా సహకారం, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై చైనా, రష్యా ప్రతినిధులు పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల్‌ వలవన్‌, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. భవిష్యత్తులో విపత్తులు వస్తే ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం ఎలాంటి సన్నద్ధతతో ఉందో కూడా వారు అడిగి తెలుసుకున్నారు. నగరంలో మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, తాగునీటి సరఫరా తీరు, పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలపై బ్రెజిల్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు ఆరా తీశారు. జీవీఎంసీ కమిషనర్‌, కలెక్టర్‌తోనూ వేర్వేరుగా మాట్లాడారు. 24 గంటలూ విద్యుత్తు, తగినంత నీటి సరఫరా కోసం అవలంబిస్తున్న విధానాలనూ అడిగి తెలుసుకున్నారు.

మరోసారి అంతర్జాతీయ గుర్తింపు….
అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు, యుద్ధనౌకల సమీక్ష వంటి కార్యక్రమాలతో గత రెండేళ్లుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విశాఖ మహా నగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుతోంది. విదేశీ ప్రతినిధుల రాక సందర్భంగా బీచ్‌ రోడ్డులో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గురువారంనాటి సదస్సులో మరికొన్ని ముఖ్యాంశాలు…
* ఆకర్షణీయ నగరాల ఎంపికపై చర్చలో అన్ని దేశాల ప్రతినిధులు భాగస్వాములయ్యారు. సాంకేతిక వినియోగం ఎంత అవసరమో, ప్రజా భాగస్వామ్యం అంతే అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇప్పటికంటే మెరుగైన సేవలందించేందుకు తగిన ప్రణాళికలు అవసరమని నిర్ణయించారు.

* పట్టణీకరణతో సవాల్‌గా మారిన మౌలిక సదుపాయాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంచి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు. మురుగు నీటి సరఫరా వ్యవస్థ, రహదారుల నిర్మాణం, పేదరిక నిర్మూలన, మురికివాడల్లో మెరుగైన సదుపాయాల కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో చర్చించారు.

* స్థానిక ప్రభుత్వాల్లో నిధుల సమీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆర్థిక రంగ నిపుణులు సూచించారు. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కేవలం నిర్వహణ ఖర్చులకే సరిపోతోందని, కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడాల్సి వస్తోందని, అందువల్ల స్థానిక సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

* పట్టణాల్లో, నగరాల్లో మురికివాడల నిర్మూలన కోసం పెద్దఎత్తున గృహ నిర్మాణాల కోసం ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. బ్రెజిల్‌, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రస్తావించారు. తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా మురికివాడల సంఖ్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.