అందం.. ఆహ్లాదం… ఆనందం…

జూన్ 25 నుంచి ప్రణాళిక అమలు
ఆకర్షణీయ నగరం దిశగా విశాఖ అడుగులు
సీఎన్జీ వాహనాల వినియోగంపై కేంద్రం దృష్టి
ఇళ్లకు వంటగ్యాస్ పైపులైను సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
కాలుష్యం లేని వాతావరణం.. ఇంటింటికీ వంటగ్యాస్ పైపులైను.. రద్దీ లేని రహదారులు.. 24్ల7 విద్యుత్, మంచినీటి సరఫరా.. వాహనాల నిలుపుదలకు ఆధునిక వసతులు.. మురుగునీటి వ్యవస్థ.. ఆకర్షణీయ విశాఖలో అందుబాటులోకి రానున్న సౌకర్యాలివి.. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ ఆలోచనలకు పదును పెడుతున్నాయి. అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. విశాఖను ఆకర్షణీయ నగరంగా మార్చేందుకు జూన్ 25 నుంచి కీలక ప్రాజెక్టులు పట్టాలకెక్కనున్నాయి.
ఈనాడు – విశాఖపట్నం, న్యూస్‌టుడే – కార్పొరేషన్: విశాఖ వికాసానికి అవసరమైన ప్రత్యేక ప్రణాళిక శరవేగంగా సిద్ధమవుతోంది. అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ (యూఎస్టీడీఏ) సైతం.. నగరానికి అవసరమైన ప్రాజెక్టుల కోసం నివేదికలను రూపొందిస్తోంది. దేశంలోని వంద ఆకర్షణీయ నగరాల్లో విశాఖ ఎనిమిదో స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 396 కోట్లను పొందనుంది. ఈ మొత్తం మరో రెండు నెలల్లో అందుతుంది. ఈ లోగా ఆకర్షణీయ ప్రాంతంగా ఎంపికైన 1700 ఎకరాల రామకృష్ణా బీచ్ పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టుల ప్రణాళికను మహా విశాఖ నగర పాలక సంస్థ సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందినందున మిగిలిన నిధులతో నగరమంతటికీ అవసరమైన ముఖ్య ప్రాజెక్టులను చేపట్టాలన్న యోచనలో ఉంది. ఇదంతా కొత్తగా ఏర్పాటైన గ్రేటర్ విశాఖ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 1700 ఎకరాల ఆకర్షణీయ ప్రాంతం అభివృద్ధికి ఈ సంస్థ పని చేస్తుంది. ఇందులో జీవీఎంసీ ప్రమేయం ఉండదు. ప్రాజెక్టుల తయారీ, నిర్వహణ, నిర్మాణం, అమలు, పర్యవేక్షణ మొత్తం అంతా ఈ సంస్థే చేపడుతుంది. ఈ నేపథ్యంలో యూఎస్టీడీఏ రూపొందించే ప్రణాళికలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రపంచ బ్యాంకు లేదా ఇతర సంస్థల ద్వారా రుణసాయం పొందాలనే యోచన కూడా ఉంది. నగరంలో కేంద్రం, యూఎస్టీడీఏ వేర్వేరుగా ఆకర్షణీయ పథకాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
రద్దీ నుంచి మోక్షం…: నగరంలోని రహదారులు, ప్రధాన కూడళ్లు నిత్యం రద్దీతో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని పూర్తిగా మార్చడానికి అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్, రహదారుల వ్యవస్థను సక్రమంగా అమలు చేస్తున్న పలు దేశాల్లోని విధానాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్టీఎస్ వ్యవస్థను మరింత విస్తరించడం ద్వారా వేగవంతమైన రవాణాను ప్రజలకు అందించవచ్చని, మెట్రో రైలు సదుపాయం కూడా అందుబాటులోకి వస్తే ప్రజా రవాణాను ప్రోత్సహించవచ్చని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం విశాఖను కాలుష్య రహితంగా మార్చనుంది. నగరంలోని వాహనాలను క్రమేణా సీఎన్జీలోకి మార్చేందుకు వీలుగా పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్జీఆర్బీ) మార్గాన్ని సుగమం చేసింది. ఈ సందర్భంగా దేశంలోని 11 నగరాల్లో సీఎన్జీ రిటైల్ విక్రయాల కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇందులో విశాఖపట్నానికి సైతం స్థానం కల్పించింది.
పైపు మార్గంలో వంట గ్యాస్ (పైప్డ్ కుకింగ్ గ్యాస్) ఏర్పాటుకూ కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా వూపింది. ఆర్కే బీచ్ పరిసరాల్లో పైప్డ్ కుకింగ్ గ్యాస్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
దిల్లీ తరహాలో విశాఖలో ప్రజా రవాణా వాహనాలను క్రమేణా సీఎన్జీలోకి మార్చడం ద్వారా కాలుష్యం తగ్గించేందుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. దశలవారీగా ఆటోలు, పర్యాటక వాహనాలు, వ్యక్తిగత, ప్రైవేటు పెట్రోల్, డీజిల్ వాహనాలను సైతం సీఎన్జీలోకి మార్చే ఆలోచనలో ఉన్నారు.

ఆకర్షణీయ ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 21న సమీక్ష జరపనున్నారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి రెండో దశ మొదలైంది. వివిధ శాఖలతో యూఎస్టీడీఏ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా విశాఖ నగరానికి అవసరమైన ముఖ్యమైన ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరగనుంది. 24×7 నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, బహుళ అంతస్తుల వాహనాల పార్కింగ్, అందరికీ ఇళ్లు, రవాణా, ట్రాఫిక్, డిస్పెన్సెరీల ఆధునికీకరణ వంటి అంశాలపై చేపట్టనున్న చర్యలను సీఎంకు వివరించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా యూఎస్టీడీఏ, జీవీఎంసీ అధికారులు.. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ కె.ప్రభాకర్, డీటీసీ వెంకటేశ్వరరావు, జీవీఎంసీ ఏడీసీ మోహనరావు, ఎస్ఈలు వెంకటేశ్వరరావు, చంద్రయ్య, ఎయికాం, వీపీటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజాభీష్ట ప్రకారం అభివృద్ధి
– ప్రవీణ్‌కుమార్, కమిషనర్, జీవీఎంసీల
నగర ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు ‘ఆకర్షణీయ’ పథకాల ద్వారా పరిష్కారం చూపేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశాలను సమీక్షిస్తారు. విశాఖ అభివృద్ధికి సీఎం ఇచ్చే సూచనలను కూడా ప్రణాళికలో పొందుపరుస్తాం. రవాణా, తాగునీరు, మురుగు, చెత్త పునర్వినియోగం వంటి ప్రధాన సమస్యలపై ముందుగా దృష్టిపెడుతున్నాం. త్వరలోనే ఆకర్షణీయ నగరం పనులు ప్రారంభమవుతాయి. ప్రజలకు అత్యాధునిక, సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలను, మేథావులను, నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. అవసరమైన పనులు చేపడతాం.
Source : http://www.eenadu.net/