News

Realestate News

అంతా సాంకేతిక మహిమ

అంతా సాంకేతిక మహిమ
నిత్య జీవనంలో భాగం
నేడు సాంకేతిక దినోత్సవం
నక్కపల్లి, న్యూస్‌టుడే
ఉన్నతాధికారులకు సమాచారం అందించాలంటే కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగిని ప్రత్యేకంగా జిల్లా కేంద్రానికి పంపించేవారు.. రేషన్‌ కార్డు కావాలంటే దరఖాస్తు రాసి స్వయంగా అధికారులను కలిసి విన్నవించేవారు. రైలు ప్రయాణం రిజర్వేషన్‌ కావాలంటే స్టేషన్‌కు వెళ్లి దరఖాస్తు నింపి ఇవ్వాల్సి వచ్చేది.. ఇలా ఏ అవసరమున్నా.. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, కాగితం రాసి పెట్టాల్సిందే. ఇదంతా ఒకప్పటిది. ఇప్పుడు కొండల్లో పనిచేసే అధికారులు సైతం సమాచారం అందించాలన్నా, ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవాలన్నా.. అంతా క్షణాల్లో ఉన్న చోట నుంచే విన్నవించుకునే పరిస్థితి నేటిది. ఇదంతా సాంకేతిక విప్లవం తెచ్చిన మార్పు. బుధవారం ‘సాంకేతిక దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

అంతా క్షణాల్లోనే..!
మారుతున్న కాలంతో పాటే వ్యవస్థ కొత్త హంగులు అద్దుకుంది. ఈ క్రమంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించింది. ముఖ్యంగా గడిచిన పదేళ్ల కాలంలో వచ్చిన మార్పులు, ప్రస్తుతం మారుతున్న ఆకర్షణీయత (స్మార్ట్‌) పని విధానాన్ని సులభతరం చేశాయి. ఏదైనా పని చేయించుకోవాలంటే రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడా రోజులు కాదు కదా, కనీసం గంటలు కూడా అక్కర్లేదు, క్షణాల్లో జరిలగిపోతుంది. నిపుణులు ఎప్పటికప్పుడు ఆధునికతను జోడించడంతో కావల్సిన సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం సాంకేతికత, ఎలక్ట్రానిక్‌ విధానం మన నిత్య జీవితంలో భాగమైంది.

ఒకే చోట నుంచి..!
ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ప్రతి పని వేగంగా సాగిపోతుంది. రెవెన్యూ, మండల పరిషత్తు, తదితర కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, పింఛన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇలా ఏ అవసరమైన పనులు చేయించుకోవాలన్నా ఒకే చోట నుంచి వేగంగా చేయించుకోవచ్చు. మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకుంటే చాలు దరఖాస్తులను పరిశీలించిన అధికారులు విచారణ చేపట్టి అర్హత ఆధారంగా పనిపూర్తి చేస్తున్నారు. మీ సేవ ద్వారా సుమారు 250 రకాల సేవలు పొందే వీలుంది. ఇక అధికారులు తాము నిర్వర్తించిన విధులకు సంబంధించి జరిగిన పురోగతి, ఇతర అవసరాలపై నివేదికలు సాయంత్రానికే ఆన్‌లైన్‌లో పంపించడమే కాకుండా, ఆవల నుంచి సైతం ఉత్తర్వులు తీసుకుంటున్నారు. చివరకు ఉపాధి పథకం కింద పనిచేసే కూలీల హాజరును ఈ మస్తరు ద్వారా అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు పంపింస్తున్నారు. వారికి చెల్లించే కూలి మొదలు బ్యాంకుల్లో తీసుకునే నగదు వరకు అంతా టెక్నాలజీ ద్వారా వేగంగా పూర్తవుతోంది. కూలీ చేతివేలి ముద్ర ఆధారంగా బయోమెట్రిక్‌ హాజరు తీసుకుని నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఇక ఏటీఎంలలో చిన్నసైజు కార్డులు ఉపయోగించి ఓ పరిమితి వరకు నగదు పొందే వీలుంది. పింఛన్లు పొందడానికి బయోమెట్రిక్‌తో పాటు, ఐరిస్‌ యంత్రాల ద్వారా చేపడుతున్నారు. ఇక రిజిస్టర్లలో సంతకాలు చేసి విధులకు వచ్చే ఉద్యోగులంతా ప్రస్తుతం బయోమెట్రిక్‌ హాజరు ద్వారా నమోదు పొందుతున్నారు. దీని ద్వారా పారదర్శకత ఉంటుంది. ఉద్యోగి గతంలో మాదిరిగా ఇష్టం వచ్చిన సమయంలో కాకుండా, కచ్చితంగా సమయపాలన పాటించాల్సిందే. లేకపోతే బండారాన్ని బయటపెడుతుంది. ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు దాదాపుగా ఇదే పద్దతిని అమలు చేస్తుండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో దశల వారీగా అమలు చేస్తున్నారు. సెల్‌ఫోన్లలో వచ్చిన సాంకేతిక విప్లవం అందరికీ తెల్సిందే. జరిగిన సంఘటనను క్షణాల్లో నలుగురికి చేరవేసేందుకు వీటికంటే సులువైన మార్గం లేదు. ఇక ప్రస్తుత అతిపెద్ద మార్కెట్‌గా విస్తరించి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఇంట్లో అడుగుబయట పెట్టకుండా నచ్చిన వస్తువుని ఇంటి ముంగిటకే రప్పించే మార్గాన్ని ఏర్పాటు చేసింది టెక్నాలజీనే.

అక్రమాలకు అడ్డుకట్ట.. పనుల్లో పారదర్శకత
చివరకు వ్యక్తిగత సమాచారం, గుర్తింపు కార్డుకు జాతీయ స్థాయిలో జారీ చేసిన ఆధార్‌ కార్డు జారీ సైతం టెక్నాలజీ మహిమే. ప్రస్తుతం ఆధార్‌ కార్డులేకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏ పని జరగడంలేదు. తద్వారా పారదర్శకత వస్తుంది. మరోవైపు రేషన్‌ సరకులు పొందడంలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి ఈ పోస్‌ విధానం ద్వారా కూడా చాలా వరకు అక్రమాలను తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుతున్నారు. చివరకు పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని దశల వారీగా అమలు చేస్తుండటంతో పథకాలను అర్హులకు మాత్రమే అందేలా చేస్తున్నారు. ఇక ప్రభుత్వ, జిరాయితీ భూముల వివరాలను కంప్యూటర్లలో పొందుపరిచి వాటి సమాచారం ఎక్కడ్నుంచైనా రైతులు, అధికారులు క్షణాల్లో తెల్సుకునేలా ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కడ్నుంచైనా చేయించుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. ఇక ఓటు హక్కు సులువుగా, పొందడంతో పాటు, బోగస్‌ ఓట్లు తొలగించడం అంతా టెక్నాలజీ పుణ్యమే. చివరకు పింఛన్ల పంపిణీలో అక్రమాలను అడ్డుకోగలిగారు. ఇలా ప్రతి రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసి అధునాతన వ్యవస్థలను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రగతి సాధిస్తున్నారు.

Source : http://www.eenadu.net/