News

Realestate News

అంతర్జాతీయ సమీకృత ప్రాజెక్టు

అంతర్జాతీయ సమీకృత ప్రాజెక్టు
ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి
త్వరలోనే అందుబాటులోకి హెలీ టూరిజం
తెన్నేటి పార్కు నుంచి గీతం వరకు రూ. 10 కోట్లతో కాలిబాట నిర్మాణం
యుద్ధ విమాన ప్రదర్శనశాల వద్ద మల్టీ లెవెల్‌ పార్కింగు
విశాఖ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు
వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ బాబూరావునాయుడు
ఈనాడు – విశాఖపట్నం
‘విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) చరిత్రలో నిలిచిపోయేలా భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం.. ప్రభుత్వపరంగా కొన్ని.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరికొన్ని ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తవగా.. మరికొన్ని నిర్మాణ దశలో.. ఇంకొన్ని ప్రణాళిక స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను సకాలంలో సమర్థంగా పూర్తి చేసే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం’

– బాబూరావునాయుడు

ఒకవైపు భారీ ప్రాజెక్టులు.. మరోవైపు భూసమీకరణలో వివాదాలు.. విశాఖ నగరాభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు. ప్రాజెక్టుల పూర్తికి ఆదాయ సమకూర్చుకోవటంపై దృష్టి సారిస్తూనే, వివాదాస్పద భూముల జోలికి వెళ్లకుండా భూసమీకరణ చేస్తామని చెబుతున్నారు వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ టి.బాబూరావునాయుడు. నగర పర్యాటకంలో కీలక ప్రగతి, భవిష్యత్తులో రానున్న ప్రాజెక్టులు, బృహత్తర ప్రణాళిక అమలు తదితర అంశాలపై ఆయన సోమవారం ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

* ఈనాడు: విశాఖ నగరాభివృద్ధి సంస్థకు విలువైన భూములున్నాయి. చాలావరకు ఆక్రమణలకు గురవుతున్నాయి. వీటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు..?
వీసీ: వుడా పరిధిలో 7 వేల ఎకరాలున్నాయి. ఇందులో 2,200 ఎకరాలు అభివృద్ధికి అనువైనవి. మిగిలిందంతా కొండలు, గుట్టలతో నిండి ఉంది. ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. వుడా భూముల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. భూముల వివరాల కంప్యూటరీకరణతోపాటు జియోట్యాగింగు చేస్తున్నాం. ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. 50 ఎకరాలు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయి. దీనిపై 400 కౌంటర్లు వేశాం. కొన్నింటిలో విజయం సాధించాం. హెచ్‌ఎస్‌బీసీ సమీపంలో రూ. 200 కోట్ల విలువైన రెండెకరాల భూమిని దక్కించుకున్నాం.

* ఈనాడు: ముందెన్నడూ లేని విధంగా వుడా ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టుల బాధ్యతలు భుజానవేసుకున్నారు…ఆదాయ వనరులను సమకూర్చుకోవటంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా..? ప్రాజెక్టుల సకాలంలో పూర్తికి మీ ప్రణాళిక..?
వీసీ: భారీ ప్రాజెక్టుల బాధ్యత తీసుకున్న మాట నిజమే. రాష్ట్ర విభజన అనంతరం విశాఖకు ప్రాధాన్యం పెరిగింది. పర్యాటకంగా ప్రపంచంలో ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రాజెక్టులు విశాఖ ప్రత్యేకత చాటే చిహ్నంగా నిలపాలన్నదే మా ఆకాంక్ష.. అందుకే ఎక్కడా రాజీ పడకుండా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కసారిగా వందల కోట్లు కుమ్మరించాల్సిన పనిలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నాం. వుడాకు ఉన్న వనరుల ద్వారా ఆదాయాన్ని సృష్టించుకుని.. ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అపరిష్కృత ప్రాజెక్టులపై ముందుగా దృష్టి సారించాం. వరల్డ్‌ తెలుగు మ్యూజియం, సిటీ సెంట్రల్‌ పార్కు, చిల్డ్రన్స్‌ ఎరీనా, వ్యాపార సముదాయాలు, హరిత హౌసింగ్‌ ప్రాజెక్టు, భీమిలి ఇండోర్‌ స్టేడియం, రావుగోపాలరావు స్టేడియం, విమానాశ్రాయం సుందరీకరణ, సింహాచలం రహదారి పనులు పూర్తి చేశాం. అరకులోయలోని పద్మాపురం గార్డెన్‌, పెదగంట్యాడ, అనకాపల్లి గార్డెన్లు, దాకమర్రి హౌసింగ్‌, చెర్లోపల్లి లేఅవుట్‌, మోదకొండమ్మ గుడికి ఎదురుగా ఆడిటోరియం, హుద్‌హుద్‌కు దెబ్బతిన్న గురజాడ కళాక్షేత్రం, కైలాసగిరి, తెన్నేటిపార్కు ఆధునికీకరణ పనులు, కొండకర్ల ఆవ అభివృద్ధి తదితర పనులు చేపట్టాం. పాండురంగాపురం పార్కు, హెల్త్‌ ఎరీనా, శంకుచక్రనామాలు, కేజీహెచ్‌లో గ్రీనరీ పనులు జరుగుతున్నాయి.

* ఈనాడు: ఎన్‌ఏడీ పైవంతెన, స్కై టవర్లు, టీయూ-142 తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రగతి ఎంత వరకు వచ్చింది..?
వీసీ: రూ. 120 కోట్లతో ఎన్‌ఏడీ పైవంతెన నిర్మిస్తాం. తాజాగా నిపుణులతో సమావేశమై వారి సూచనలూ కోరాం. ఈ ప్రాజెక్టు సమగ్ర పథక నివేదిక స్థాయిలో ఉంది. నివేదిక వచ్చాక టెండర్లకు వెళ్తాం. విశాఖ ప్రతిష్ట పెంచేలా ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించాలని సీఎం సూచించారు. కైలాసగిరిలో 120 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల రొటేషన్‌తో 70 మంది కూర్చుని చూసేందుకు వీలుగా స్కై టవర్ల ఏర్పాటు చేయనున్నాం. ఇది రూ. 70 కోట్ల ప్రాజెక్టు.. దీనికి ప్రతిపాదనలు ఆహ్వానించాం. ఆర్కే బీచ్‌లోని కురుసర జలాంతర్గామి సమీపంలో టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నాం. ప్రాజెక్టు బాధ్యతలనూ గుత్తేదారు సంస్థకు అప్పగించాం. ఈ పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కురుసుర జలాంతర్గామి, టీయూ -142, రాజీవ్‌ స్మృతి భవన్‌, ఏయూ కాన్వొకేషన్‌ సెంటర్‌ అన్నీ కలిపి అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలతో సమీకృత ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసే ప్రణాళికా ఉంది. ముడసర్లోవ ఉద్యానవనాన్ని సిటీ సెంట్రల్‌ పార్కు కంటే ధీటుగా తయారు చేయనున్నాం. ఇక్కడ వాటర్‌ స్పోర్ట్స్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ తదితర సదుపాయాలు కల్పిస్తాం. విశాఖలో హెలీ టూరిజం త్వరలో అందుబాటులోకి తేనున్నాం.

* ఈనాడు: సువిశాల సాగర తీరం ఉంది.. ఆర్‌కే బీచ్‌లో కొంత వరకే పర్యాటకులను, సందర్శకులను అనువుగా ఉంది. మిగిలిన ప్రాంతం అభివృద్ధిపై వుడా ప్రణాళిక ఏమైనా ఉందా..?
వీసీ: ప్రస్తుతం పర్యాటకులకు అనువుగా ఆర్కేబీచ్‌ ఉంది. ఇదే మార్గంలో తెన్నేటి పార్కు నుంచి గీతం వరకు 11 కిలోమీటర్ల నిడివిన కాలిబాట, అధునాతన విద్యుత్తు వెలుగులు, సందర్శకులు సేదతీరేందుకు సౌకర్యాలు కల్పిస్తాం. రూ. 10 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల వద్ద 300 కార్లకు, 200 ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు మల్టీ లెవెల్‌ పార్కింగు ఏర్పాటు చేస్తాం. క్యాంటిన్లు, త్రీడీ ప్యాపింగ్‌ తదితర సౌకర్యాలు సమకూరనున్నాయి. కొన్నిచోట్ల అభివృద్ధి పనులకు సీఆర్‌జెడ్‌ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

* ఈనాడు: వుడా పరిధిలో అనధికార లేఅవుట్లు నడుస్తున్నాయి. వీటి నియంత్రణకు మీ చర్యలు..?
వీసీ: వుడా పరిధిలోని 200 అనధికార లేఅవుట్లు గుర్తించాం. కొన్నింటిని తొలగించాం. మిగిలినవాళ్లు నిబంధనల మేరకు అనుమతి తీసుకోవడానికి.. సొమ్ము చెల్లించడానికి ముందుకొచ్చారు. నిబంధనల అతిక్రమణకు ఎవరు పాల్పడినా సహించేది లేదు.

* ఈనాడు: భూసేకరణ ప్రక్రియలో అవాంతరాలు అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలు..?
వీసీ: వుడా ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురావాలంటే భూసేకరణ తప్పనిసరి. నిధులు సమకూర్చుకోడానికి ఇదో మార్గం. భూసమీకరణ విషయంలో వివాదాస్పద ప్రాంతాల జోలికి ప్రస్తుతం వెళ్లడంలేదు. ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు లేని భూములను ప్రభుత్వ ఆదేశాల మేరకు సేకరించే అవకాశాలు పరిశీలిస్తున్నాం. ముదపాక వ్యవహారం ప్రస్తుతం ప్రభుత్వం దృష్టిలో ఉంది.

* ఈనాడు: వీఎంఆర్‌డీఏ ప్రతిపాదన ఎంత వరకు వచ్చింది..?
వీసీ: విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదన ప్రభుత్వ దశలో ఉంది. ఈ అవసరాలకు అనుగుణంగానే వుడా బడ్జెట్‌ రూపొందించాం.

* ఈనాడు: వుడా పరిధిలోని మిగిలిన జిల్లాల్లో ప్రగతి పరిస్థితి ఏమిటి..?
వీసీ: శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది ఒడ్డు సుందరీకరణ, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారిలో పచ్చదనం అభివృద్ధి, విద్యుదీకరణ పనులు చేపట్టాం. విజయనగరం విజ్జి స్టేడియంలో వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. ఈ రెండు జిల్లాలతోపాటు వుడా పరిధిలోని తూ.గో జిల్లాలోనూ అభివృద్ధికి అవకాశాలపై దృష్టిసారించాం.

* ఈనాడు: మాస్టర్‌ ప్లానులో భాగంగా రహదారుల నిర్మాణం ప్రక్రియ ఎంతవరకు వచ్చింది..?
వీసీ: బృహత్తర ప్రణాళికలో భాగంగా 24 రహదారులను 200 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలన్నది ప్రణాళిక. రహదారుల అనుసంధానానికి అడ్డంకులు తొలగిపోవడంతోపాటు 30 వేల ఎకరాల అభివృద్ధికి ఆస్కారం కలుగుతుంది. ప్రస్తుతం మాస్టర్‌ ప్లాను పరిధిలో నాలుగు జిల్లాల్లో 1761 చదరపు కిలోమీటర్ల నిడివిన రోడ్లున్నాయి. వీటిని 6,724 చదరపు కిలోమీటర్లకు విస్తరించనున్నాం.