News

Realestate News

అంతరాయం లేని విద్యుత్తు ఇచ్చేందుకే

Real Estate News

జిల్లాలో 75 శాతం పూర్తయిన పవర్‌గ్రిడ్‌ పనులు
పలు ప్రాంతాల్లో పాక్షిక సరఫరా

గుజరాతీపేట (శ్రీకాకుళం), న్యూస్‌టుడే : ఒడిశా రాష్ట్రంలోని ఆల్‌గురా నుంచి తూర్పు గోదావరి జిల్లా వేమగిరి వరకు నిర్వహిస్తున్న పవర్‌గ్రిడ్‌ పనుల్లో భాగంగా ఆదివారం జిల్లాలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, తాగునీటి పథకాలకు సరఫరా ఇచ్చారు. ఆల్‌గురా నుంచి వేమగిరి మార్గంలోని ప్రధానంగా విశాఖపట్నంలోని-పెందుర్తి-గరివిడి మధ్య విజయనగరం జిల్లా గుర్లలో పనులు చేశారు. గరివిడి నుంచి టెక్కలి మధ్య ఆమదాలవలస మండలం చీమలవలస (శ్రీకాకుళం సర్కిల్‌) మధ్య పనులు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో అతిశక్తివంతమైన 765 కేవీ లైన్‌ వేయడంతో 220 కేవీ లైన్ల సరఫరా అంతటిని నిలిపివేశారు. అయితే 20 మెగా వాట్ల విద్యుత్తు వినియోగించుకోవడానికి అవకాశం ఉండటంతో శ్రీకాకుళం ప్రధాన కేంద్రంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో సమయానుకూలంగా విద్యుత్తు సరఫరా ఇచ్చారు. మొత్తం మీద సాయంత్ర ఆరుగంటలకు మొత్తం సరఫరా పునరద్ధరించారు.

అంతరాయం లేని విద్యుత్తు కోసమే
పవర్‌గ్రిడ్‌ పనులు జరగడం వల్ల అంతరాయం లేని విద్యుత్తు ఇవ్వడానికి వీలవుతుందని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెందుర్తి నుంచి గరివిడికి రెండు మార్గాల ద్వారా 220కేవీ విద్యుత్తు సరఫరా అవుతుందని తెలిపారు. పవర్‌గ్రిడ్‌ పనుల్లో భాగంగా ఆమదాలవలస మండలం చీమలవలస వద్ద చేపట్టిన విద్యుత్తు పనులు 75 శాతంపూర్తి అయ్యాయని తెలిపారు. మిగతా పనులు పవర్‌గ్రిడ్‌ ఆదేశం మేరకు చేస్తారని స్పష్టం చేశారు.