News

Realestate News

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై అసంతృప్తి

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై అసంతృప్తి
పనితీరు మెరుగుపరచుకోకుంటే తీవ్ర చర్యలు
జేసీ సృజన స్పష్టీకరణ
విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై సంయుక్త కలెక్టర్‌ జి.సృజన తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. అధికారుల తీరును తప్పుబట్టారు. పనితీరు మెరుగు పర్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఐసిడిఎస్‌కు చెందిన సీపీడీఓలు, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుపేదలకు చెందిన బాలబాలికలు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందచేయాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె గుర్తు చేశారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగా కేంద్రాల నిర్వహణపై పలు ఆరోపణలు వస్తున్నాయని, పిల్లలకు ఇవ్వవల్సిన కోడిగుడ్లు బహిరంగ మార్కెట్‌కు తరలిపోతున్నాయని వాపోయారు. సీపీఓడీలు, పర్యవేక్షకుల పరిశీలన లోపమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోందన్నారు. కోడిగుడ్లు బహిరంగ మార్కెట్‌కు తరలిపోవడానికి బాధ్యులైన వారిని గుర్తించి నివేదిక అందచేస్తే తదుపరి చర్యలను తీసుకుంటామన్నారు. కేంద్రాలకు శాశ్వత వసతి కల్పించే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆమె నిలదీశారు. రెవెన్యూ అధికారుల సహాయంతో స్థలాలను సేకరించి భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుతు వంటి మౌలిక వసతులను కల్పించాలని, అన్ని కేంద్రాలకు వంటపాత్రల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఇంకా మిగిలిన 8 కేంద్రాలకు తక్షణమే వాటిని అందచేయాలన్నారు.